పోరు రసవత్తరం | Sakshi
Sakshi News home page

పోరు రసవత్తరం

Published Sat, Jun 20 2015 4:16 AM

పోరు రసవత్తరం - Sakshi

 సాక్షి ప్రతినిధి, కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక అసలు పోరు మొదలయింది. శుక్రవారానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్‌సీపీ నుంచి డి.వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, మరో ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు దండుశేషు యాదవ్, వి.వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. అయితే ప్రధాన పోటీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికార టీడీపీ మధ్యనే నెలకొంది. ఇక పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఇందుకోసం ఓటుకు నోటు ఇచ్చేందుకు బరితెగిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిచేందుకు అవసరమైన బలం లేకపోయినప్పటికీ... బరిలో నిలిచి గెలుపునకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మొదట ఓటుకు లక్ష ఆఫర్ చేసి.. తాజాగా ఈ రేటును కాస్తా రెండు లక్షలకు పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు ఒక స్వతంత్య్ర అభ్యర్థిని అధికార పార్టీయే రంగంలోకి దించినట్టు సమాచారం.

 పెరుగుతున్న రేటు
 వాస్తవానికి జిల్లాలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అధికంగా ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు అధికం. ఒకవైపు గెలిచేందుకు అవసరమైన ఓట్లు లేకపోవడం అధికార పార్టీ టీడీపీకి గుబులు పుట్టిస్తోంది. దీంతో ఓటు రేటును కాస్తా అమాంతం పెంచేసింది. మొన్నటి దాకా ఓటుకు లక్ష ఆఫర్ చేసిన అధికార పార్టీ.. తాజాగా ఈ రేటును రూ.2 లక్షలకు పెంచేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బనగానపల్లె, ఆదోని నియోజకవర్గాల్లో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాల్సిందేనన్న అధిష్టానం ఆదేశాల నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు తమ శాయశక్తులా ప్రలోభాల పర్వానికి తెరలేపారు. దారికి రాని వారిని బెదిరించే చర్యలకూ పాల్పడుతున్నారు.
 
 బెదిరింపుల పర్వం షురూ
 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కంటే అధికార టీడీపీకి 80 ఓట్ల బలం తక్కువగా ఉంది. అయినప్పటికీ బరిలో నిలిచిన నేపథ్యంలో ఓటుకు ఇంత రేటు చొప్పున తీసుకుని ముందుకు వస్తే సరే.. లేనిపక్షంలో బెదిరింపుల పర్వానికీ అధికార పక్షం తెరలేపింది. మంత్రాలయం నియోజకవర్గంలో పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన స్వతంత్య్ర ఎంపీటీసీ అభ్యర్థి హసీనా భానును ఇప్పటికే అధికార పార్టీ తమవైపు రావడం లేదని బెదిరింపులకు దిగింది. పత్తికొండ, డోన్, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో అదే తరహా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement