మరో అడుగు.. | Sakshi
Sakshi News home page

మరో అడుగు..

Published Tue, Nov 5 2013 1:37 AM

Investigation on nirmal bharat abhiyan scheme

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్‌ఎల్) నిర్మాణం పేరిట రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనంపై విచారణ కోసం మరో కమిటీ నియమించారు. వారం రోజుల క్రితం ఏజేసీ వెంకటయ్యతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు, డ్వామా పీడీలను కలిపి ఐదుగురితో కమిటీ వేశారు. తాజాగా ప్రభుత్వం విచారణ కోసం ‘విజిలెన్స్’ను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో మరుగుదొడ్ల నిర్మాణం వ్యవహారంపై విచారణలో  మరో అడుగు ముందుకు పడింది. జిల్లాలో సుమారు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్మల్ భారత్ అభియాన్(ఎన్‌బీఏ) కింద మంజూరైన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్‌కిట్స్‌ను సరఫరా చేసిన ధనలక్ష్మి ఏజెన్సీస్‌కు నిర్మాణం కాకుండానే రూ.17.60 కోట్లు చెల్లించిన వైనంపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. .

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు అక్రమాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయిలో ఐఎస్‌ఎల్ టూల్‌కిట్స్ నాణ్యతను పరిశీలించి తీసుకోవడంలో వీఆర్‌వోలు, ఎంపీడీవోల నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఐఎస్‌ఎల్ టూల్‌కిట్స్ కొనుగోలుకు పెద్దమొత్తంలో చెల్లించేందుకు అప్పటి ముగ్గురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తుండటం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వారంలో రెండు కమిటీలు
ఎన్‌బీఏ కింద   ఈ బాగోతంలో కమీషన్ల రూపంగా రూ.కోటికి పైగా చేతులు మారాయన్న ఆరోపణలపై విచారణ వేగవంతమైంది. మొదటి నుంచి మరుగుదొడ్లలో అవకతవకలపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్ సెప్టెంబర్ చివరి వారంలో ఏజేసీ వెంకటయ్య ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అంతకు ముందు కలెక్టర్ పంపిన నివేదికపై స్పందించిన ప్రభుత్వం ఇటీవలే విజిలెన్స్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇన్‌చార్జి రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ కె.సురేందర్ ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగినట్లు తెలిసింది. జిల్లాలో ఎన్‌బీఏ కింద ఎప్పుడు మరుగుదొడ్లకు నిధులు మంజూరయ్యాయి? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఐఎస్‌ఎల్ టూల్‌కిట్ల కోసం ‘ధనలక్షి’కి ఏయే తేదీల్లో ఎంత మొత్తంలో చెల్లించారు? టూల్‌కిట్ల సరఫరా నాటికి జిల్లాలో గ్రౌండింగైన మరుగుదొడ్ల సంఖ్య ఎంత? మరుగుదొడ్ల నిర్మాణం మొదలవక ముందే రూ.17.60 కోట్లు ఎందుకు చెల్లించారు? తదితర అంశాలపై విజిలెన్స్ ఆరా తీస్తుంది. మరుగుదొడ్డిని నిర్మించుకునే లబ్ధిదారుడే నేరుగా ఆన్‌లైన్ ద్వారా టూల్‌కిట్స్ కొనుగోలు చేయాలన్న నిబంధనలున్నా... ఎంపీడీవోలు ఎందుకు ‘ధనలక్ష్మి’ ద్వారా కొనుగోలు చేశారు? రూ.17.60 కోట్ల చెల్లింపుల వెనుక ఎవరెవరి ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయి? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

టూల్‌కిట్ల సరఫరాకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ బదిలీ కాగా, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్సీ పదోన్నతిపై బదిలీ అయ్యారు. జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి పదవీ విరమణ చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేయడంపైన విజిలెన్స్ అభ్యంతరం చెప్తూనే ఎంపీడీవోల పాత్రపైనా ఆరా తీస్తుంది. తమ పైఅధికారుల ఒత్తిళ్ల మేరకు చెల్లింపులు జరిపామని చెప్తున్నా తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన కొందరు ఎంపీడీవోల్లో కనిపిస్తుంది.

Advertisement
Advertisement