ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు | Sakshi
Sakshi News home page

ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు

Published Wed, Oct 1 2014 2:27 AM

ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు

సాక్షి, ఏలూరు : టీడీపీ సర్కారు మార్కు జన్మభూమి కార్యక్రమం కొత్తగా మన ఊరు అనే పేరు తగిలించుకుని మరోసారి ప్రజల మధ్యకు రాబోతోంది. గురువారం నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏకకాలంలో ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పేదల ముంగిటకే సంక్షేమ ఫలాలు తీసుకువెళ్లేందుకు.. దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది. వీటికి ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో వారంతా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల సాధనకు దీని ద్వారా శ్రీకారం చుడుతున్నారు. పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర వంటి కార్యక్రమాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించనున్నారు. పెంచిన పింఛను మొత్తాలను జన్మభూమి గ్రామసభల్లోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పశు వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. కార్యక్రమం జరిగే 14 రోజుల్లో ఏదో ఒక రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తారు.
 
 తొలి రోజు ఇలా...
 తొలిరోజు జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో జన్మభూమి-మన ఊరు కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తారు. అక్టోబర్ 3న విజయదశమి సెలవు కావడంతో ఆ రోజు కార్యక్రమాలకు విరామం ఇచ్చా రు. 4నుంచి నవంబర్ 20 వరకూ (ఆదివారాలు సెలవు) నిర్విరామంగా గ్రామ సభలు నిర్వహిస్తారు.పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి విభాగాలు వీటి నిర్వహణ బాధ్యతల్ని వహిస్తారుు. ప్రతిరోజు ప్రతి మండలంలోని రెండు గ్రామాల్లో రెండు బృందాలు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తాయి. ఒక బృందానికి ఎంపీడీవో, మరో బృందానికి తహసిల్దార్ నేతృత్వం వహిస్తారు. గ్రామ, మండల స్థాయి అధికారులతో పాటు స్థానిక నేతలు ప్రతి బృందంలో ఉంటారు. పట్టణాల్లో నిత్యం రెండు వార్డుల్లో జన్మభూమి-మన ఊరు జరుగుతుంది. ఇక్కడా రెండు బృందాలు ఏర్పా టు చేస్తారు. ఒక బృందంలో కమిషనర్, మరో బృం దంలో కమిషనర్ స్థాయి అధికారి ఉంటారు.
 
 ‘మా తెలుగు తల్లి’ గీతాలాపనతో...
 ప్రతిరోజు ‘మా తెలుగుతల్లి’ గీతాలపనతో మొదల య్యే కార్యక్రమం రోజంతా జరుగుతుంది. స్థానికులతో బృంద చర్చలు జరుపుతారు. ఏదైనా మండలం లో 28 కంటే ఎక్కువ గ్రామాలుంటే అక్కడ రెండు కం టే ఎక్కువ బృందాలను ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ, మునిసిపల్ వార్డుల అభివృద్ధికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంటరీ’ని, వార్షిక ప్రణాళికలను ఈ బృందాలు రూపొందించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమానికి  కలెక్టర్ ఇన్‌చార్జిగా, జిల్లా పంచాయతీ అధికారి సహాయకారిగా వ్యవహరిస్తారు. మునిసిపాలిటీల్లో కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు ఇన్‌చార్జిలుగా ఉంటారు.
 
 ఏడు మిషన్లు ఇవే... ఐదు గ్రిడ్లు ఇలా
 సాంఘిక సాధికారత, ప్రాథమిక రంగం, విజ్ఞానం-నైపుణ్యాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, వసతుల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, సేవా రంగం అభివృద్ధి అంశాలను ఏడు మిషన్లుగా ప్రభుత్వం పేర్కొంది. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ గ్రిడ్‌లను ఐదు గ్రిడ్లుగా సూచిస్తూ వీటి అభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంటోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement