అంతా నాటకంలో భాగమే! | Sakshi
Sakshi News home page

అంతా నాటకంలో భాగమే!

Published Sun, Nov 10 2013 2:30 AM

kiran kumar reddy plays drama as per delhi, says venkaiah naidu

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర సీమాంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడుతున్న మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగమేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఆరోపించారు. అంతా ఢిల్లీ స్క్రిప్టు ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతోంది. కిందపడినా పై చెయ్యి మాదేననేది ఆ పార్టీ సిద్ధాంతం. ప్రజలు ఎటువైపు మొగ్గితే.. అటువైపు మేం కూడా మాట్లాడామని చెప్పుకోవాలనేది వారి ఆలోచన. శనివారమిక్కడ పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, యడ్లపాటి రఘునాథ్‌బాబులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ కార్యకర్త అని, ఆయన కాంగ్రె స్ అధినాయకత్వానికి పరమ విధేయుడు, అత్యంత విధేయుడు అని దిగ్విజయ్‌సింగే చెబుతున్నారు. ఆ అత్యంత విధేయుడు ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు? ఇదేదో ఆయన సొంతంగా మాట్లాడుతున్నారనుకుంటే పొరపాటు. ఇంకా చాలా ఉంది వ్యవహారం. తొందరలోనే అంతా బయటపడుతుంది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, సీమాంధ్రలోని కేంద్ర మంత్రులందరూ ఇప్పుడు ఫోజులు కొడుతున్నారని.. రేపు అక్కడికి వెళ్లి మేం చివరి వరకూ పోరాడామని చెప్పుకుంటారని మండిపడ్డారు. సీమాంధ్రలోని 13 మంది ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే ప్రభుత్వం ఉండదని, కానీ వాళ్లు ఆ పని చేయరని విమర్శించారు. ఒకవేళ చేసినా స్పీకర్ ఆమోదం తెలపని విచిత్ర స్థితి నెలకొని ఉందని దుయ్యబట్టారు.
 
 సీమాంధ్ర ప్రయోజనాలూ ముఖ్యమే...
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమకు ఎంత ముఖ్యమో.. ఈ విషయంలో సీమాంధ్ర ప్రజలకున్న అనుమానాలు తొలగించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ‘‘తెలంగాణపై మా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ అనుకూలం.. బిల్లు తీసుకురండి, మద్దతిస్తాం.. దాంతోపాటు సీమాంధ్ర ప్రజలకున్న అనుమానాలు, ఆందోళనలు తొలగించండని జీవోఎంకు చెప్పాం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన విషయం కాదని..  ఫలానా జిల్లానో, ఫలానా ప్రాంతమో ఎటువైపు ఉండాలన్న అంశంలో నిర్ణయాలు లేకపోవడం ఏమిటని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ఇప్పుడు  ‘సీమాంధ్రకు న్యాయం చేయకుండానే కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిస్తారా’ అంటూ అంతకుముందు ఓ విలేకరి అడిగిన ప్రశ్నను వెంకయ్య ప్రస్తావిస్తూ.. మేం అంత గుడ్డిగా కాంగ్రెస్ ఏం చేసినా దాని వెనుకపడి పోతామా’’ అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాత్రమే తాము నడుచుకుంటామని స్పష్టంచేశారు. ప్రజలంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రజలని అర్థమని అన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివని, నాలుగు రాష్టాల్లో తమ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్‌లో జరిగే ఫైనల్‌లోనూ మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
 
 బీజేపీలో చేరిన యెర్నేని సీతాదేవి
 
 శనివారం ఇక్కడ కిషన్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి బీజేపీలో చేరారు. అలాగే, విజయవాడకు చెందిన ఎ.వీ.రంగారావు, భజరంగ్‌దళ్ నేత యమన్‌సింగ్, రమేష్, రాములు, సురేందర్‌సింగ్‌తో పాటు కొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రైతులేనిదే రాజ్యం లేదు’ అనే నినాదంతో వచ్చే ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో వలే సీమాంధ్రలోనూ బీజేపీ బలపడుతుందన్నారు. యెర్నేని సీతాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ త్రిశంకుస్వర్గంలో ఉందని ప్రత్యామ్నాయం కోసం ప్రజలు బీజేపీని ఎంచుకున్నట్లు చెప్పారు.
 

Advertisement
Advertisement