ఇక చెత్త నుంచీ ఆదాయం | Sakshi
Sakshi News home page

ఇక చెత్త నుంచీ ఆదాయం

Published Sat, Dec 13 2014 1:13 AM

ఇక చెత్త నుంచీ ఆదాయం - Sakshi

 * ప్రతి నాలుగు వార్డులకో ఖాళీ స్థలం ఎంపిక చేయాలి
* పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక శాఖ ఆదేశాలు

అమలాపురం టౌన్ : పట్టణాల్లో సేకరించే పొడి చెత్త నుంచి ఆదాయాన్ని రాబట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీలకు మార్గదర్శకాలు పంపింది. వాడి పారేసే ప్లాస్టిక్ సామాన్లు, పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ల వంటివి పొడి చెత్త కేటగిరీలోకి వస్తాయి. అలాగే పట్టణాల్లోని ఆసుపత్రులు, ల్యాబ్‌లు తదితర చోట్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తాయి. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. వీటిని ఎక్కడికక్కడ చెత్తకుప్పల్లో పాడేస్తారు. వాటిని ఓ క్రమ పద్ధతిలో సేకరించి ఏకమొత్తంగా విక్రయిస్తే కిలో ప్లాస్టిక్ వస్తువులకు రూ.10 నుంచి రూ.20 వరకూ ఆదాయం వచ్చే వీలుంది.

దీనిపై పురపాలక శాఖ దృష్టి సారించింది. పారిశుధ్య సిబ్బంది రోజూ వీధులను శుభ్రం చేస్తూ, చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నప్పుడు పొడి చెత్తను వేరేగా సేకరించే ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లోని డ్రెయిన్లలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వీటిల్లో పూడికలు తీసేటప్పుడు ఇకనుంచి పొడి చెత్తను వేరేగా సేకరించనున్నారు.
 
ప్రతి నాలుగు వార్డులకో పాయింట్
పొడి చెత్తను సేకరించిన తర్వాత దానిని ఓచోట వేసి, ఆ తర్వాత విక్రయించేందుకు వీలుగా మున్సిపాలిటీలో ప్రతి నాలుగు వార్డులకో స్థలాన్ని ఎంపిక చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఆ ఖాళీ స్థలంలో రోజువారీ సేకరించిన పొడిచెత్తను గ్రేడింగ్ చేసి విక్రయించేలా చేయాలని సూచించింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో సేకరిస్తున్న మామూలు చెత్తను పోసేందుకు సరైన డంపింగ్ యార్డులు లేవు.

ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పొడిచెత్త పేరుతో నాలుగు వార్డులకో ఖాళీ స్థలం ఎంపిక చేయటం ఇబ్బందేనని పారిశుధ్య సిబ్బంది అంటున్నారు. పెపైచ్చు రోజూ పొడి చెత్తను సేకరించి దానిని విక్రయించి ఆదాయ వనరుగా మార్చటం కూడా సాధ్యం కాదేమోనని కొందరు అంటున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ ఈ ఆదేశాలకు ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేశాయి. అయితే అమలు ఎప్పటినుంచి మొదలవుతుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement