రెండు నాల్కలు | Sakshi
Sakshi News home page

రెండు నాల్కలు

Published Wed, Sep 3 2014 1:25 AM

రెండు నాల్కలు

 జిల్లాలో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరికి తోచినది వారు మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేయడం ఎంతవరకూ సమంజసమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదికూడా ఓ ప్రాంతానికి చెందిన మెజారిటీ ప్రజల మనోగతానికి సంబంధించిన అంశంపై తమకు నచ్చినట్టు మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. ఏమైనా అంటే తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారే కానీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఇటీవల కాలంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఈ వింతపోకడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ విషయంలో స్పష్టమైంది. కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ అసెంబ్లీలో మంగళవారం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రస్తావించారు. ఈ డిమాండ్‌పై సుమారు 20 నిమిషాల సేపు అనర్గళంగా మాట్లాడారు. కోనసీమలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఆ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక జిల్లా అవసరమని, ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని సూచిస్తూ అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. సరిగ్గా ఆ సమయానికి కొద్దిగా అటుఇటుగా అదే పార్టీకి చెందిన లోక్‌సభలో టీడీపీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తన పార్లమెంటరీ పరిధిలో అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా విలేకరులతో  ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోనసీమకు ప్రత్యేక జిల్లా అవసరం లేదని కుండబద్ధలు కొట్టారు. ‘విభజన’ అనంతరం ‘నియోజకవర్గాల పునర్విభజన’తో పెరిగే నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాల అవసరం ఉండదని సూత్రీకరించారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదని కూడా చెప్పుకొచ్చారు. ఇలా ఓ ప్రధాన అంశంపై ఇరువురు నేతలు పరస్పర విరుద్ధంగా మాట్లాడడంపై పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు కోనసీమ ప్రత్యేక జిల్లా అనే డిమాండ్ ఇప్పటి మాట కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఇది నలుగుతూనే ఉంది. కోనసీమలోని 16 మండలాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ 1999లో ప్రధానంగా తెరపైకి వచ్చింది. అంతకుముందు కూడా దీనిపై చర్చ జరిగినప్పటికీ, ఉద్యమరూపం దాల్చింది మాత్రం దివంగత జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉండగానే.
 
 అప్పట్లో కోనసీమ అభివృద్ధి పేరుతో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ఈ ఉద్యమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని కొంతకాలం నడిపించారు. 15 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపించి, ఆమరణ దీక్ష ప్రకటించి బాలయోగి జోక్యంతో ఆనక విరమించుకున్న విషయం కోనసీమ వాసులకు గుర్తుండే ఉంటుంది. అనంతరం కాలగర్భంలో కలిసిపోయిన ఆ డిమాండ్ ఇటీవల తెలంగాణ  నుంచి ఏడు మండలాలు ఆంధ్రలో విలీనమైన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా మన్యసీమ జిల్లా తెరపైకి రావడంతో మరోసారి చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో విలీన మండలాల్లో కలెక్టర్లు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసి, నివేదికను ప్రభుత్వానికి పంపిన అనంతరం జరిగిన కేబినెట్ భేటీలో ప్రత్యేక జిల్లా ప్రస్తావనంటూ ఏదీ లేదని సీఎం చంద్రబాబు కొట్టిపారేశారు.
 
 అంతటి ప్రక్రియ పూర్తయిన మన్య సీమ జిల్లా డిమాండే పక్కకుపోగా, ఇప్పుడు అకస్మాత్తుగా ఎమ్మెల్యే గొల్లపల్లి కోనసీమ జిల్లా డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రత్యేక జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చి 1999లో గొల్లపల్లి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఉద్యమ రూపం దాల్చినప్పుడు కానీ, తాజాగా కోనసీమలో మరోసారి ఆందోళనకు సిద్ధపడినప్పుడు కానీ పెదవి విప్పని గొల్లపల్లి ఇంత అకస్మాత్తుగా అసెంబ్లీలో తన వాణి వినిపించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రక్రియ అంతా పూర్తయిన మన్యసీమ జిల్లానే సీఎం కాదన్న తర్వాత ప్రభుత్వ స్థాయిలో ఎటువంటి ప్రతిపాదన లేని కోనసీమ జిల్లాపై గొల్లపల్లి లేవనెత్తిన డిమాండ్ అధికార పార్టీలో  చర్చనీయాంశమైంది.
 
 1999లో ఆందోళనను ముందుండి నడిపించిన మెట్ల, తొలిసారి గొంతువిప్పిన గొల్లపల్లి ఇటీవల కోనసీమ జిల్లా కోసం ‘దగాపడ్డ చర్మకారుల మహాసభ’ అధ్యక్షుడు ఈతకోట తుక్కేశ్వరరావు అమలాపుంలో 72 గంటల దీక్ష చేపట్టినప్పుడు ఏమయ్యారని కోనసీమవాసులు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి మెట్ల ప్రత్యేక జిల్లా కోసం తాజాగా ఆందోళనకు సిద్ధపడడం, మెట్లకు స్వయానా అల్లుడైన ఎంపీ తోట నరసింహం ప్రత్యేక జిల్లా అవసరం లేదనడం, అదే పార్టీ ఎమ్మెల్యే గొల్లపల్లి ప్రత్యేక జిల్లా కోసం అసెంబ్లీలో మాట్లాడడంపై కోనసీమవాసులు విస్మయానికి గురవుతున్నారు. ఒకేపార్టీలో ఉన్న వారంతా ఓ కీలకాంశంపై భిన్నమైన వాదనలు వినిపించడం కంటే, కోనసీమ మనోగతాన్ని ఆవిష్కరించే రీతిలో ఏకాభిప్రాయానికి రాకుండా అయోమయానికి గురి చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement