కర్నూలు హార్ట్ ఫౌండేషన్ రోల్ మోడల్‌గా నిలుస్తుంది | Sakshi
Sakshi News home page

కర్నూలు హార్ట్ ఫౌండేషన్ రోల్ మోడల్‌గా నిలుస్తుంది

Published Mon, Sep 29 2014 1:43 AM

కర్నూలు హార్ట్ ఫౌండేషన్ రోల్ మోడల్‌గా నిలుస్తుంది

కర్నూలు(హాస్పిటల్):
 గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలోనే కర్నూలు హార్ట్ ఫౌండేషన్ రోల్ మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక సునయన ఆడిటోరియంలో వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో మంత్రి మాట్లాడారు. వైద్యవిధానంలో ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకొస్తోందన్నారు. వైద్య గుండె జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న పుస్తకాన్ని  ఆవిష్కరించారు. ఏపీ కార్డియాలజి సొసైటీ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ మంత్రి చేతుల మీదుగా రూ.5 లక్షల చెక్కును కర్నూలు హార్ట్ ఫౌండేషన్‌కు అందించారు. అనంతరం కేర్ ఆసుపత్రి ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ నరసింహన్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. కార్డియో థొరాసిక్ సర్జన్ పోస్టును భర్తీ చేయాలన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఆనంద్ బృందంచే గానకచేరి నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జాయింట్‌కలెక్టర్ కన్నబాబు, కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ జిఎస్.రాంప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నరసింహులు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు కేఈ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
 మంత్రి కారును అడ్డుకున్న
 హౌస్ సర్జన్లు
 అనంతరం ప్రభుత్వ ఆసుపత్రినుంచి బయటకు వచ్చి కారులో వెళ్లేందుకు సిద్ధమవుతున్న మంత్రి కామినేనిని హౌస్ సర్జన్లు కొంతసేపు అడ్డున్నారు. ఐదు నెలలుగా హౌస్ సర్జన్లకు స్టైఫండ్ ఇవ్వడం లేదని, పీజీ క్వార్టర్స్ అధ్వానంగా ఉన్నాయని, తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ సర్జన్లు పని చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. పీజీ వైద్యులు, హౌస్ సర్జన్ల సమస్యలను వైద్య ఆరోగ్యశాఖ ఓఎస్‌డీతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


 

Advertisement
Advertisement