అప్పనంగా ఇచ్చేశారు ! | Sakshi
Sakshi News home page

అప్పనంగా ఇచ్చేశారు !

Published Mon, May 18 2015 4:50 AM

Labor contract tenders making there own

- కాంట్రాక్ట్ లేబర్ టెండర్లలో ఇష్టారాజ్యం
- రూ.23 లక్షలకుపైగా పనులు ఇచ్చేసిన వైనం
- మరో రూ.71 లక్షల పనులపై కన్ను
- చిత్తూరు కార్పొరేషన్‌లో విచిత్రమైన వ్యవహారం
చిత్తూరు (అర్బన్):
చిత్తూరు కార్పొరేషన్‌లో ఈ ఏడాది మే నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఇంజినీరింగ్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు గత నెల ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలిచారు. ఇందులో 10 మంది వీధిదీపాల నిర్వాహకులు, 77 మంది బోరు ఆపరేటర్లు, నీటి పైపులైన్ల నిర్వాహకులు, 9 మంది సెక్యూరిటీ గార్డులు, ఆరుగురు కంప్యూటర్ ఆపరేటర్ల కోసం టెండర్లు పిలిచారు. వీరిలో కంప్యూటర్ ఆపరేటర్లకు నెలకు రూ.9,500, మిగిలిన వారికి నెలకు రూ.8,400 చెల్లిస్తామని అధికారులు టెండర్లలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ 0-3 శాతం వరకు నిర్వహణ వ్యయాన్ని కోట్ చేస్తే ఎవరు తక్కువ ధరకు పనులు చేస్తారో వారికి టెండర్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు ఏడుగురి నుంచి దరఖాస్తులు అందాయి.

ఆన్‌లైన్ టెండర్లను ఇటీవల అధికారులు ఓపెన్ చేశారు. వీరిలో ఇద్దరు కాంట్రాక్టర్లు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వారి దరఖాస్తులను తిరస్కరించారు. బాలాజీ క్రియేటివ్ కన్‌స్ట్రక్షన్స్, సీఎస్ అండ్ కో, జేఎంసీ, వి.మునిరత్నం, దండుమారియమ్మ అనే ఐదుగురు కాంట్రాక్టర్లు అన్ని అర్హతలతో టెండరు దాఖలు చేశారు. అయితే ఈ పనులను చేయడానికి తమకు ఎలాంటి నిర్వహణ వ్యయం అవసరం లేదని, ఉచితంగా సేవలు చేస్తామని టెండర్లు వేశారు. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడానికి నాలుగు మార్గాలున్నాయి. మొదటిది అందరి పేర్లను ఓ చీటీలో రాసి లాటరీ పద్ధతి ద్వారా టెండరు ఖరారు చేయవచ్చు. రెండోది గత అనుభవం ఎక్కువగా ఉన్న వారికి టెండరు ఇవ్వాలి. మూడోది ఎవరు ముందు టెండరు వేశారో వారికి పనులు అప్పగించవచ్చు.

చివరగా ఏదీ వద్దనుకుంటే టెండరు ప్రక్రియను రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవచ్చు. కానీ ఇక్కడ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. పరిపాలన అనుమతి పేరిట రూ.24 లక్షల విలువైన పనులను మునిరత్నం అనే వ్యక్తికి అప్పగించారు. అయితే రూ.50 లక్షలు మించిన బోరు ఆపరేటర్ల పనికి కౌన్సిల్ అనుమతి తప్పనిసరి కావడంతో (రూ.71 లక్షలు విలువ) దాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఇది కూడా మునిరత్నం అనే కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి టెండరు వేసినా నిబంధనలు పాటించలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపరంగా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో కార్పొరేషన్‌లో పనిచేసే ఓ అధికారి పాలకవర్గాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
 
కమిషనర్ అనుమతితోనే..
ఐదుగురు ఒకే ధరలో టెండరు వేస్తే అందులో సాంకేతిక అంశాలు ఉంటే నేను పరిష్కారం చెప్పవచ్చు. కానీ ఇందులో సాంకేతిక అంశాలు లేవు. అందుకే పరిపాలన ఆమోదం కోసం కమిషనర్‌కు ఫైలు పంపి, ఆయన ద్వారా స్టాండింగ్ కమిటీలో ఉంచాం. అక్కడ ఆమోదం చెప్పడంతో మునిరత్నానికి పనులు ఇచ్చాం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు.

Advertisement
Advertisement