కొండెక్కుతున్న ‘దీపం’ | Sakshi
Sakshi News home page

కొండెక్కుతున్న ‘దీపం’

Published Thu, Nov 6 2014 3:06 AM

కొండెక్కుతున్న ‘దీపం’ - Sakshi

 ఏలూరు : పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రారంభించిన దీపం పథకం క్రమంగా కొండెక్కుతోంది. మహిళల కష్టాలను తొలగించేది టీడీపీ ప్రభుత్వమేనంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరు విషయాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని మహిళలు మొరపెట్టుకుంటున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు.
 
 పెండింగ్‌లో దరఖాస్తులు
 రెండేళ్లుగా దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. దీంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల సమయానికి జిల్లాలో 65 వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వ తరఫున నుంచి సబ్సిడీ మొత్తాలను డిపాజిట్ చేయకపోవడంతో పాత దరఖాస్తులన్నింటిని టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి నాలుగు నెలలైనా కొత్త కనెక్షన్ల పంపిణీకి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. కొత్త షెడ్యూల్ విడుదలైతే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు వేచి చూస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదు.
 
 40 వేల కనెక్షన్లు మంజూరన్నారు.. 22 వేలు ఇచ్చారు
 రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మహిళల వంటింటి కష్టాలను గటెక్కిస్తామంటూ జిల్లాకు 40 వేల దీపం కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 22 వేల కనెక్షన్లు మంజూరు చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖకు ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆయిల్ కంపెనీల వారీగా ఈ కనెక్షన్లు కేటాయింపు జరగకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెల కొంది. మహిళల కట్టెల కష్టాలను తొలగించేందుకు దీపం కనెక్షన్లు ఇచ్చింది మేమే అంటూ మహిళల మెప్పు కోసం పాకులాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కనెక్షన్లు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండడంపై మహిళల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
 ప్రభుత్వం ఆదేశిస్తే నెల రోజుల్లో ఇచ్చేస్తాం
 దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ విషయంలో ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తే నెల రోజుల్లోనే పంపిణీ చేస్తామని డీఎస్‌వో డి.శివశంకరరెడ్డి తెలిపారు. ఏయే కంపెనీలను ఏయే మండలాలకు కేటాయించారో స్పష్టంగా షెడ్యూల్ వస్తే గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. మండలాల్లో కొత్త వాటికి దరఖాస్తులను తీసుకోవడంతో పాటు వాటిని రెవెన్యూ, పౌరసరఫరాలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కలిసి విచారణ చేశాకే మంజూరు ఇస్తామన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు.
 

Advertisement
Advertisement