బామ్మర్ది భూదందా? | Sakshi
Sakshi News home page

బామ్మర్ది భూదందా?

Published Wed, Oct 10 2018 7:11 AM

Land Grabbing In Srikakulam - Sakshi

వజ్జ బాలరాజు... వృత్తిరీత్యా పశుసంవర్థక శాఖలో ఉన్నతోద్యోగి! ప్రవృత్తి మాత్రం వివాదాస్పద భూముల కొనుగోలు! ఇందులో భాగంగానే ఎచ్చెర్ల మండలం పొన్నాడ రెవెన్యూ గ్రామ పరిధిలో భూయజమానులకు, కౌలు రైతులకు మధ్య ఉన్న చిన్న వివాదాన్ని ఆసరాగా తీసుకొని రూ.కోటికి పైగా విలువైన భూమిని అతిచౌకగా దక్కించుకునేందుకు స్కెచ్‌ వేశారు. నకిలీ రైతుల పేర్లతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. వెనుకాముందు చూడకుండా రిజిస్ట్రేషన్ల శాఖలోనూ పనులు చకాచకా జరిగిపోయాయి. రెవెన్యూ శాఖ వారైతే మరో అడుగు ముందుకేసి కొనుగోలు చేసిన భూమికి సుమారుగా మరో ఎకరం అదనంగా మ్యూటేషన్‌ కూడా చేసేశారు. బాలరాజు ఇంత సునాయాసంగా ఈ భూమిని దక్కించుకోవడం వెనుక చక్రం తిప్పింది మాత్రం ఆయన బావ, ప్రభుత్వ విప్‌ రవికుమారేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జాతీ య రహదారికి ఆనుకొని ఎచ్చెర్ల మండలం పొన్నాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని ఆలపాన గురువునాయుడుపేట (ఏజీఎన్‌ పేట) వద్ద సర్వే నంబరు 1, సర్వే నంబర్లు 499–524లో సుమారు 204 ఎకరాల భూమి ఉంది. పూర్వం ఈ భూమి మాడుగుల పాపారావు, కానుకుర్తి వెంకటనరసింగ సుదర్శనరావులకు చెందినది. వారి నుంచి హనుమంతు దీనబంధు, ఆయన కుటుంబసభ్యులైన నారాయణదొర, సునీత, సరస్వతి 2003 ఫిబ్రవరి, జూలై నెలల్లో రెండు దఫాలుగా 138.79 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి పట్టా నంబర్లు 1135లో హనుమంతు దీనబంధుకు, 1136తో హనుమంతు సునీతకు, 1129తో హనుమంతు సరస్వతి, 1132తో హనుమంతు నారాయణదొరకు రెవెన్యూ శాఖ 2009 సంవత్సరంలో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసింది.

వివాదమే ఆసరాగా...
దీనబంధు, ఆయన కుటుంబసభ్యులు మొత్తం 138.79 ఎకరాలు కొనుగోలు చేసే సమయానికే ఆ భూమిలో కొంతమంది రైతులు కౌలుకు సాగుచేస్తున్నారు. అయితే అమ్మకం జరిగినందున తమకు కౌలు హక్కుల పేరిట కొంత భూమి కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో దీనబంధు కుటుంబం చాలావరకూ వారితో సెటిల్‌మెంట్‌ చేసుకుంది. ఈ దశలోనే ఈ భూమి వ్యవహారం బాలరాజు దృష్టికి వచ్చింది. స్థానికంగా భూమి వ్యవహారాల్లో దళారులైన బచ్చు నరసింగరావు, తారా గోవిందరెడ్డిల సహాయంతో స్కెచ్‌ వేశారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో భూమి రికార్డులు తారుమారు చేశారు. అలపాన అప్పారావు, అచ్యుతరావు, మాధవరావు, నూకయ్య తదితరుల పేర్లతో ఆ భూమి ఉన్నట్లు 1బీ, పాసుపుస్తకాలు సృష్టించారు. వారికి 11.77 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. వారికే కొంత మొత్తం చెల్లించి ఆ భూమిని వజ్జ బాలరాజు కొన్నట్లుగా 2014 సంవత్సరంలో మూడు దఫాలుగా రిజిస్ట్రేషన్లు చేయించారు. అయితే అప్పటికే హనుమంతు దీనబంధు కుటుంబానికి ఈ భూములపై హక్కులు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు బాలరాజు పేరున మ్యూటేషన్‌ చేసేశారు. ఆయన కొన్నట్లుగా చూపిస్తున్న భూమి 11.77 ఎకరాలే అయినప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో ఏకంగా 12.65 ఎకరాల భూమిని మ్యూటేషన్‌ చేసి ఖాతా నంబరు 2301తో పాసు పుస్తకం కూడా జారీ చేయడం గమనార్హం.

అంతా సునాయాసంగా...
సాధారణంగా ఏదైనా భూమికి రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్‌ చేసేముందు సంబంధిత భూమి రికార్డులను సబ్‌రిజిస్ట్రార్‌ క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. ఏమాత్రం సందేహం వచ్చినా సంబంధిత తహసీల్దారు కార్యాలయం నుంచి రికార్డులు తెప్పించుకొని పరిశీలించాలి. కానీ బాలరాజు మాత్రం రెవెన్యూ శాఖ సిబ్బందితో తన భూమికి మ్యూటేషన్‌ చేయించుకున్నట్లే రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్‌ కూడా సునాయాసంగా చేయించుకున్నారు. ఆ సమయంలో తన బంధువైన రవికుమార్‌ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండటం, అప్పటి పొందూరు సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న కంచరాన రోహన్‌కుమార్‌ కూడా బంధువే కావడంతో బాలరాజు తప్పుడు పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని బాధిత యజమానులైన దీనబంధు కుటుంబం ఆరోపిస్తోంది.

‘డిజిటల్‌ కీ’తో పక్కదారి...
తమకు చెందిన భూమిని బాలరాజు అక్రమంగా మ్యూటేషన్‌ చేయించుకున్నారని తెలుసుకున్న దీనబంధు కుటుంబం కూడా ఎచ్చెర్ల తహసీల్దార్ల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ భూమిని తిరిగి తమ పేర్లతో మ్యూటేషన్‌ చేయాలని కోరింది. ఈ సమయంలో ఎచ్చెర్ల తహసీల్దారుగా ఉన్న కె.రామ్మోహన్‌రావు జూలై 31వ ఉద్యోగ విరమణ చేశారు. అయితే ఆయన ‘డిజిటల్‌ కీ’తో ఆగస్టు 1వ తేదీన ఆ భూమిని దీనబంధు కుటుంబానికి మ్యూటేషన్‌ అయిపోయింది. దీంతో బాలరాజు అక్రమ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. డిజిటల్‌ కీతో తనకు అన్యాయం జరిగిందంటూ రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారులను సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దీనబంధు కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే విషయమై జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఆర్డీవో కోర్టులో విచారణ చేస్తాం...
పొన్నాడ రెవెన్యూ పరిధిలోని ఏజీఎన్‌ పేటలోని భూ వివాదంపై మాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాం. దీనిపై పూర్తి వివరాలు జిల్లా కలెక్టరుకు నివేదించాం. ఇరువర్గాలకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నాం. ఈ వివాదంపై ఆర్డీవో కోర్టులో విచారణ చేస్తాం.– ఎంవీ రమణ, శ్రీకాకుళం ఆర్డీవో

Advertisement
Advertisement