ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు

Published Sun, Jan 26 2014 1:16 AM

lok sabha election arrangements in Guntur

సాక్షి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికల క్రతువులో భాగంగా ఓటర్ల తుది జాబితా ప్రచురణ ప్రక్రియ దాదాపు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రచురించే పనిలో రెవెన్యూ యంత్రాంగం తలమునకలై ఉంది. దీంతో పాటు నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వివరాల్ని ప్రకటించనున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించి రాజకీయ పార్టీలకు సాఫ్ట్ కాపీ అందించనున్నారు. ఈ పోలింగ్ బూత్‌లలో సమస్యాత్మకం (సెన్సిటివ్), అత్యంత సమస్యాత్మకం (హైపర్ సెన్సిటివ్) గల వాటిని గుర్తించి ఓ నివేదిక సిద్ధం చేశారు. 
 
 ఫీ అండ్ ఫెయిర్ పోలింగ్‌కు అవసరమైన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో 3,739 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అవసరమైతే ఈ బూత్‌లకు సహాయంగా మరికొన్ని (ఆగ్జిలరీ బూత్‌లు) ఏర్పాటు అంశాన్ని ఆయా నియోజకవర్గాలకు బాధ్యులైన రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. వాటిల్లో విద్యుత్ సౌకర్యం, నిఘా కెమెరాల ఏర్పాటుకు అనువుగా ఏర్పాట్లు చేసేందుకు జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో అత్యధికంగా బూత్‌లు వినుకొండలో, అత్యల్పంగా బాపట్లలో ఉన్నాయి. ఎన్నికల పరిశీలకులు జిల్లాలో మకాం వేస్తున్నందున వారికి అవసరమైన సహాయకుల్ని, అతిథి గృహాల వివరాల్ని ఎన్నికల కమిషన్‌కు జిల్లా యంత్రాంగం నివేదించింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి రెడీగా ఉండాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. 
 
 ఈ నెలాఖరుకు బదిలీలు 
 కొలిక్కి వచ్చే అవకాశం?
 సార్వత్రిక ఎన్నికల విధుల్లో నేరుగా పాలుపంచుకునే రెవెన్యూ, పోలీస్ అధికారుల జాబితాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు చేరాయి. ఈ నెలాఖరుకు బదిలీలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మూడేళ్ళు దాటిన, సొంత జిల్లాకు చెందిన వారైతే కచ్చితంగా బదిలీపై వేరే జిల్లాకు వెళ్ళాల్సిందే. రెవెన్యూ అధికారుల పరంగా జిల్లాకు చెందిన, మూడేళ్ల సర్వీసు ఒకేచోట పూర్తి చేసిన తహశీల్దార్లంతా బదిలీపై జోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్ళే అవకాశం ఉంది. 
 
 ముగ్గురు నలుగురు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, 54 మంది తహశీల్దార్లు బదిలీల జాబితాలో ఉన్నట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో జిల్లాలో తహశీల్దార్లు ప్రకాశం జిల్లాకు బదిలీ కాగా, అక్కడ విధులు నిర్వహిస్తున్నవారంతా అప్పట్లో ఇక్కడకు వచ్చారు. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 10లోపు బదిలీలు పూర్తిచేయాలని ఆదేశాలిచ్చింది. అయితే రెవెన్యూలో ఈ నెలాఖరు వరకు ఓటర్ల నమోదు పక్రియ, ఉద్యోగుల పదోన్నతులు పెండింగులో ఉండటం వల్ల వారి బదిలీలు ఫిబ్రవరి మొదటి వారంలో ఉండవచ్చని సమాచారం. తాజాగా పోలీసు శాఖలో అర్బన్, రూరల్ జిల్లా పరిధిలో సుమారు 30 మంది వరకు ఎస్‌ఐల బదిలీలు జరిగాయని తెలిసింది.
 

Advertisement
Advertisement