గళం విప్పారు.. | Sakshi
Sakshi News home page

గళం విప్పారు..

Published Wed, Dec 24 2014 12:16 AM

గళం విప్పారు.. - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి, నియోజకవర్గ ప్రజల గొంతును వినిపించడంలో పలువురు శాసన సభ్యులు కృతకృత్యులయ్యారు. హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు సాగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశా సందర్భంగా అధికార టీడీపీకి దీటుగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలపై గళం విప్పారు. మాట్లాడే అవకాశాన్ని అడుగడుగునా హరించే యత్నం జరిగినా.. పట్టుబట్టి మరీ ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విషయంలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్సాహం కనబరిచారు.

 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ముసురుమిల్లి ప్రాజెక్టు గురించి వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును విస్తరిస్తే 4 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని సభ దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజనులు అధికంగా ఉన్న, వెనుకబడిన ప్రాంతమైన మొల్లేరు, మల్లవరం తదితర గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 తుని నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన దాడిశెట్టి రాజా తనకు కేటాయించిన మూడు నిమిషాల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చీటికీమాటికీ వైఎస్సార్‌సీపీపై నోరు పారేసుకుంటున్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీరును అసెంబ్లీ సాక్షిగా రాజా ఎండగట్టారు. మంత్రి సోదరుడు యనమల కృష్ణుడు చేస్తున్న అరాచకాన్ని నియంత్రించకుండా, నీతివాక్యాలు వల్లిస్తున్న యనమలను ఎండగట్టేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. సముద్ర తీరంలో హేచరీల నుంచి యనమల కృష్ణుడు అనధికార వసూళ్లు చేస్తున్న విషయాన్ని సభలో ప్రస్తావించారు.

 రంపచోడవరం నుంచి తొలిసారి ఎమ్మె ల్యే అయిన వంతల రాజేశ్వరి.. పోలవరం ముంపు మండలాల ప్రజలకు ప్రభుత్వ సేవ లు అందని అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశాలు  ప్రారంభమైనప్పటినుంచీ సభలో మాట్లాడేందుకు యత్నించగా చివరి రోజు ఆమెకు అవకాశం లభించింది. తూర్పు గోదావరిలో విలీనమైన నాలుగు పోలవరం ముంపు మండలాల సమస్యలతో పాటు, ఏజెన్సీలో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. గిరిజనుల సమస్యలను పూర్తిస్థాయిలో శాసనసభ దృష్టికి తీసుకురావడంతో రాజేశ్వరి శాయశక్తులా కృషి చేశారు.

 ఇదిలా ఉండగా అధికార పక్షం నుంచి పలువురు శాసనసభ్యులు జిల్లాకు చెందిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లగా, మరికొందరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. విపత్తుల శాఖను కూడా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. హుద్‌హుద్ తుపాను, కరవు పరిస్థితులపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కరవు, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రంగంపేట మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి చోటు చేసుకున్న అంశాన్ని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇతర శాఖల నుంచి తనిఖీ అధికారులుగా నియమించాలని కోరారు.

 కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు, కాలుష్యంతో పంట దిగుబడి తగ్గిపోతోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సభలో చెప్పారు. గోదావరి వరదల సమయంలో మేట వేసిన ఇసుకను తీసుకునే అవకాశం రైతులకు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతితోనే విగ్రహాలు ఏర్పాటు చేయాలని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సభలో ప్రస్తావించారు. అచ్చంపేటలోని ఏయూ పీజీ సెంటర్‌ను మహిళా యూనివర్సిటీగా మార్చాలని, కాకినాడ రూరల్ మండలంలో మత్స్యశాఖ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సభ దృష్టికి తీసుకువెళ్లారు.  అంతర్వేది దేవస్థానం నుంచి కేశవదాసుపాలెం వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్డు వెంబడి ప్రధాన పంట కాలువకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రస్తావించారు.

  బీజేపీ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా రాజమండ్రి రోడ్ కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. 2014లో శంకుస్థాపన చేసిన ట్రిపుల్ ఐటీ ఏమైందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు సాహిత్య పీఠం ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభ దృష్టికి తీసుకువచ్చారు.

  కాగా ముమ్మిడివరం, రాజానగరం, రామచంద్రపురం, పిఠాపురం, మండపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పలుకే బంగారం అన్నట్టుగా వ్యవహరించారు.

వీరికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు
 సోదరుడి కుమారుడు సుబ్బారాయుడు మృతితో మొదటి మూడు రోజులూ సమావేశాలకు వెళ్లలేకపోయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సోమ, మంగళవారాల్లో జరిగిన సమావేశాల్లో ప్రధాన సమస్యలపై మాట్లాడేందుకు గట్టిగా పట్టుపట్టారు. కానీ అవకాశం ఇవ్వకుండా తన నోరు నొక్కేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 ఇసుక రీచ్‌ల వ్యవహారాన్ని ప్రస్తావించేందుకు సహచర ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు నోటీసు ఇచ్చినప్పటికీ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు.

విలీన మండలాల్లో ప్రభుత్వ సేవలు దూరం
ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరిలో కలిసిన నాలుగు మండలాల్లో ప్రభుత్వ సేవలు అందడం లేదు. ఈ మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియమించాలి. తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉండడంతో.. వారు ప్రభుత్వ సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారు. అటువంటివారిని తెలంగాణకు పంపించాలి. అత్యవసర సర్వీసులైన వైద్యం, విద్యుత్, మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ ఏడు మండలాలు, విలీనమైన నాలుగు మండలాల్లో పింఛన్లు అందక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. అర్హులైనవారి పింఛన్లను అనేక కారణాలతో రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించాలి. కులధ్రువీకరణ పత్రాలు పొందేందుకు 1958 నాటి రికార్డులు తీసుకురావాలంటూ గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు. నిరాక్షరాస్యులైన గిరిజనులు వాటిని భద్రపరచుకోలేని పరిస్థితి ఉంది. అనేకమంది విద్యార్థులకు కులధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడు మండలాల పరిధిలో అనేకచోట్ల అటవీ శాఖ అభ్యంతరాలతో మధ్యలోనే రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటికి అనుమతులు ఇచ్చి వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు par తీసుకోవాలి.ఙ- వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం

అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దాడులా?
‘అధికారాన్ని ప్రజాసంక్షేమం కోసం కాకుండా ధనార్జన కోసం ఉపయోగిస్తున్న మీ తమ్ముడు యనమల కృష్ణుడిని కంట్రోల్ చేయలేని మీరు (ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు) శాసనసభలో నీతివాక్యాలు వల్లిస్తారా? నియోజకవర్గంలో అరాచక పాలన సాగిస్తున్నారు. పోలీసులు సైతం ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. యనమల సొంత మండలం తొండంగిలోని సముద్రతీర ప్రాంతంలో నడుస్తున్న హేచరీల నుంచి యనమల కృష్ణుడు అనధికార వసూళ్లు చేస్తున్నారు. దీనికి నిరాకరించిన హేచరీపై దాడులు చేయించడం వాస్తవం కాదా? ‘షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న మీ (యనమల) సోదరుడిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మీ అధికారాన్ని అడ్డుపెట్టుకునే చేస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో సూటిగా సమాధానం par ఇవ్వాలి’ఙ- దాడిశెట్టి రాజా, తుని ఎమ్మెల్యే

అధికార పార్టీ తప్పులను కప్పిపుచ్చుకోడానికే సమావేశాలు
అధికార పార్టీ నేతల తప్పులను కప్పి పుచ్చుకుని, చేయనిదానిని చేసినట్టు చూపించుకోవడానికే అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టుంది. సభలో కస్టోడియన్‌గా ఉండవలసిన గౌరవ స్పీకర్ వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉంది. సామాజిక కార్యకర్తలను అధికార పార్టీ కమిటీల్లో భాగస్వాములుగా చేయడం ద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినట్టయింది. దీనిపై సభలో ప్రస్తావించాను. కేవలం పచ్చచొక్కాలకు అవకాశం కల్పించేందుకే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కమిటీల్లో సామాజిక కార్యకర్తలకు స్థానం par కల్పించారు.ఙ- జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత

రాజధాని కోసం చట్టాన్ని మీరుతున్నారు
రాజధాని భూసేకరణ విషయంలో సంబంధిత చట్టాన్ని మీరి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం  రైతులు ఒకటికంటే ఎక్కువ పంటలు పండించే భూములను సేకరించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే తక్కువగా మాత్రమే తీసుకోవాలి. కానీ ప్రభుత్వ వైఖరి న్యాయపమైన చిక్కులు తెచ్చి పెట్టేదిగా ఉంది. మంగళగిరి ప్రాంతంలో సుమారు 16 వేలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూములున్నా, కేవలం తుళ్లూరు ప్రాంతంలోనే భూసేకరణ చేస్తామనడం వెనుక ఆంతర్యమేమిటి? ల్యాండ్ పూలింగ్, లేదా బలవంతంగా సేకరణ పేరుతో రైతుల పొట్ట కొట్టవద్దు. అటవీ భూములను డీనోటిఫై చేసేందుకు కేంద్రం కూడా వీలు కల్పించింది. రాజధాని బిల్లు ముందుగా ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టం అయిన తర్వాత మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోవాలి, కానీ ఇంకా చట్టం కాకుండానే సింగపూర్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం చట్టసభలను అవమానపరచడమే. రాజధాని అంశంలో ప్రభుత్వం ఏ దశలోనూ నిబంధనలు పాటించడంలేదు. రైతు రుణమాఫీ అంశంలో కూడా ప్రభుత్వం దగా చేసింది. వాగ్దానం చేసినట్టు కాకుండా రోజుకో మాట చెప్పి, చివరకు రూ.50 వేలు అన్నారు. తీరా అది కూడా పూర్తిగా అమలు జరగలేదన్నారు. బొబ్బిలిలో ఒక రైతుకు తీసుకున్న రూ.50 వేల రుణానికి రూ.3.16 రుణమాఫీ లభించిందంటే పరిస్థితి అర్థం par చేసుకోవచ్చు.ఙ- ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ (వైఎస్సార్‌సీపీ)
 

Advertisement
Advertisement