భోజనం బాగుందా..! | Sakshi
Sakshi News home page

భోజనం బాగుందా..!

Published Thu, Feb 13 2014 2:10 AM

Meal Good ..!

కడప రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు మన పిల్లలు అనే భావనతో కృషి చేసి మంచి ఫలితాలను సాధించాలని సాంఘిక సంక్షేమశాఖ కమిషర్ జయలక్ష్మి హాస్టల్ వెల్ఫేర్ అధికారుల (హెచ్‌డబ్ల్యుఓ)ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో వసతి గృహ సంక్షేమ అధికారులు, వసతిగృహ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల పనితీరు, వసతిగృహ నిర్మాణాలు, ఉపకార వేతనాల మంజూరుపై కమిషనర్ సమీక్షించారు.
 
 సొంత పనిలా భావించి వసతి గృహంలో విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలన్నారు. మన హాస్టల్..మన పిల్లలు అనే భావనతో పనిచేయాలన్నారు. హెచ్‌డబ్ల్యుఓలు సమయపాలన పాటించాలన్నారు. ఉదయం ఆరు గంటలకు వసతిగృహంలో ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా జాయింట్ డెరైక్టర్ ఫోన్‌లో పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రార్థనా సమయంలో నీతి పద్యాలు విద్యార్థులచే వల్లె వేయించి దాని అర్థాన్ని వివరించాలన్నారు. హాస్టల్‌ను శుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఉపకారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అపరిశుభ్ర మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చైతన్యం తీసుకు రావాలన్నారు. ఇందుకు సంబంధించి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి అపరిశుభ్ర మరుగుదొడ్లను గుర్తించాలన్నారు.
 
 విద్యార్థులను దత్తత తీసుకోవాలి
 జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో పదవ తరగతి విద్యార్థుల పురోగతికి చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం ఫలితాలు సాధించేలా శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా కేంద్రం నుంచి సరఫరా చేసిన మెటీరియల్‌ను చదివించాలన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇద్దరు,ముగ్గురు చొప్పున విద్యార్థులను దత్తత తీసుకుని స్టడీ మెటీరియల్‌ను చదివించాలన్నారు. సమావేశంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీపీఓ అపూర్వ సుందరి, ఏపీఈడబ్ల్యుఐడీసీ ఈఈ కరుణాకర్‌రెడ్డి, ఏపీఎస్‌ఎంఐడీసీ ఈఈ మల్లేశ్వరరెడ్డి, హెచ్‌డబ్ల్యుఓలు తదితరులు పాల్గొన్నారు.
 
 మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
 ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, నూతన హాస్టల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్ టి.జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా కమిషనర్ నగరంలోని ప్రకాశ్‌నగర్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్, బాలుర కళాశాల, సాంఘిక సంక్షేమ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.

తొలుత ప్రకాశ్‌నగర్‌లో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యంగా ఉండేలా గదుల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. అనంతరం రూ. 2.2 కోట్లతో దొంగలచెరువు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌లో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసే సౌకర్యంతోపాటు స్నానపు నీటిని రీసైక్లింగ్ చేసే విధానానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సోలార్ విద్యుత్ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
 
 అక్కడే ఉన్న వసతి గృహాన్ని తనిఖీ చేశారు. స్నానపు గదులకు కొళాయి కనెక్షన్లు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పైపులైను ఏర్పాటు చేసి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని ఇంజనీరింగ్ విభాగం ఈఈ కరుణాకర్‌రెడ్డిని ఆదేశించారు. తిరుమల-తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఎదురుగా రూ. 80 లక్షలతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల వసతి గృహ సముదాయ నిర్మాణాలను పరిశీలించారు. కమిషనర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జేడీ ప్రసాద్, ఏపీఎస్‌ఎంఐడీసీ ఈఈ మల్లేశ్వరరెడ్డి, డీఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, హెచ్‌డబ్ల్యుఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement