మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి | Sakshi
Sakshi News home page

మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి

Published Thu, Aug 20 2015 3:07 AM

మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్‌ఆర్ జిల్లా కడప నారాయణ కళాశాలలో చదువుతూ ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినులు మనీషారెడ్డి, నందిని కేసు నిష్పక్షపాతంగా విచారించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కళాశాల అధినేత మంత్రి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. విద్యార్థినుల మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్‌లో రాస్తారోకో చేశారు. విద్యార్థినుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో నాయకులు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు లోకేష్‌శెట్టి, సుధీర్‌రెడ్డి, పెద్దన్న, ఓసీ  సంక్షేమ సంఘం బుర్రా జయవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని విద్యా సంస్థలను ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ చేయించారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడానికి యాజమాన్యమే కారణమని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాన్సన్‌బాబు, నరేష్, నగర అధ్యక్ష,కార్యదర్శులు రమణయ్య, మనోహర్ పాల్గొన్నారు. యాజమాన్యం ఒత్తిడి భరించలేకనే అమ్మాయిలు బలవన్మరణానికి పాల్పడ్డారని ఏపీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మహేష్, సహాయకార్యదర్శి హరీష్ పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ చేపట్టారు. కళాశాల అధినేత మంత్రి కావడంతో విద్యార్థినుల మృతి కేసులో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి గోపి ఆరోపించారు.

 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి డిమాండ్ చేశారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్, ఏసీఎస్‌బీ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఘటనపై స్పందించకుండా మంత్రి నారాయణను కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయా సంఘాల నాయకులు కరుణకుమార్, సాకే సురేష్, ఎం.మురళి  విమర్శించారు. ఇండియన్ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఐఎంఎం అధ్యక్షులు మహబూబ్‌బాషా, యూసుబ్, జాఫర్, షఫి, ఇమ్రాన్ పాల్గొన్నారు. తాడిమర్రిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. గుత్తి పట్టణంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గుంతకల్లు  పట్టణంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థినులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలను బంద్ చేయించారు. హిందూపురం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి అనంతర దహనం చేశారు. కదిరి పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. తనకల్లులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు, కుందుర్పిలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. రాయదుర్గం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.  పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువులో టీఎస్‌ఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి అక్కులప్ప నాయక్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 ‘నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయండి’
  యూనివర్సిటీ : విద్యార్థుల నిండు ప్రాణాలు బలితీసుకుంటున్న నారాయణ విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలని ఎస్కేయూ ఐక్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతూ బుధవారం ఎస్కేయూలో బంద్ నిర్వహించారు. ఒక వైపు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు నారాయణ విద్యా సంస్థకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు కూడా నారాయణ కళాశాలల్లో వాటాలు ఉండడం వల్లే ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.వి.లింగా రెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు గెలివి నారాయణ రెడ్డి, ఐక్య కార్యచరణ సమితి నేత పులిరాజు,  ఏఐఎస్‌ఎఫ్ నేత వెంకటేశులు, ఎన్‌ఎస్‌యూఐ నేత శంకర్‌రెడ్డి, జీవీఎస్ నేత చిన్న శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement