కుదిరిన రాజీ | Sakshi
Sakshi News home page

కుదిరిన రాజీ

Published Wed, Dec 3 2014 1:21 AM

కుదిరిన రాజీ

ఏలూరు :జిల్లాలో కలెక్టర్, జేసీలతో ఉద్యోగ సంఘాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి మంగళవారం రాత్రి తాత్కాలికంగా తెరపడింది. మూడు గంటలపాటు ఉద్యోగ సంఘాలు,కలెక్టర్, జేసీలతో మంత్రి పీతల సుజాత,వేర్వేరుగా చర్చించి  ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. కలెక్టర్, జే సీలు ఉద్యోగులను దుర్భాషలాడుతూ, సస్పెన్షన్లు, క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వారిని బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెల్సిందే. మంత్రి పీతల సుజాత  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబును హైదరాబాదులో మంగళవారం కలిసి జిల్లాలో పరిస్థితిని వివరించారు.
 
 వారు రాజీ చేయాలని నిర్ణయించారు.  ఆమె ఏలూరుకు చేరుకుని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో తొలుత ఎన్జీవో సంఘ జేఏసీ చైర్మన్ ఎల్‌వీ సాగర్, హరనాధ్, శ్రీనివాస్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యి వారి సమస్యలను విన్నారు.  సుమారు  గంటపాటు ఉద్యోగులు తమ సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు.  కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎన్‌ఎంల జీతాల నిలుపుదల, వివిధ ఉద్యోగుల సస్పెన్షన్ల వ్యవహారాలను ఆయా ఉద్యోగుల చెప్పారు. కలెక్టర్, జేసీలు హామీ ఇస్తేగాని తాము రాజీపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు  తేల్చి చెప్పారు. అనంతరం ఆమె కలెక్టర్, జేసీలను పిలిపించి ఉద్యోగ సంఘాల సమస్యలను వారిద్దరికి వినిపించారు. అనంతరం ఇరువర్గాల మధ్య రాజీని కుదిర్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ సామరస్యపూర్వకంగా అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య రాజీ చేశామన్నారు.  
 
 తాత్కాలిక విరమణే
 ఎన్జీవో సంఘ జేఏసీ చైర్మన్ సాగర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఐఏఎస్‌లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని హామీ ఇచ్చారని, అందుకే వారిద్దరి బదిలీల అంశం, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించామన్నారు. మంత్రి పీతల సుజాత ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు, యంత్రాంగంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాముంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజుల హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు  చోడగిరి శ్రీనివాస్, ఆర్‌ఎస్ హరనాథ్, పి వెంకటేశ్వరరావు,శ్రీధర్‌రాజు, శ్రీకాంత్ సాల్మన్, బి సోమయ్య, గుడిపాటి నరసింహారావు, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోయేషన్ జిల్లా అధ్యక్షులు బి.సోమశేఖర్, కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement