మైనరే ముఠా నాయకుడు | Sakshi
Sakshi News home page

మైనరే ముఠా నాయకుడు

Published Sun, Oct 27 2013 4:04 AM

Minor as gang leader held in chain snatching case

ఏలూరు(ఆర్‌ఆర్ పేట) న్యూస్‌లైన్: ఏలూరు, కొవ్వూరు పోలీస్ సబ్‌డివిజన్ల పరిధిలో ఇటీవల జరిగిన వరుస గొలుసు దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను పట్టుకోగా వారిలో ముగ్గురు మైనర్లు కావడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. వివరాలను ఎస్పీ ఎం.రమేష్ శని వారం స్థానిక పోలీస్ సమావేశ మం దిరంలో విలే కరులకు వెల్లడించారు.  ఏలూరు, కొవ్వూరు పోలీస్ సబ్ డివి జన్ల పరిధిలో ఇటీవల చెయిన్ స్నాచిం గ్‌లు ఎక్కువ కావడంతో ఎస్పీ ఆదేశా ల మేరకు పోలీసు అధికారులు ప్రత్యే క నిఘా వేశారు. ఏలూరు టూటౌన్ ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబుకు శనివారం ఉదయం అందిన సమాచారం మేరకు టూటౌన్ క్రైం ఎస్సై ఎం.కోటేశ్వరరావుతో కలిసి స్థానిక పాత బస్టాండు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న గొలుసు దొంగలు వీరిని చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
 
 వారివద్ద ఉన్న 37.5 కాసుల బరువైన 10 గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలో 5, భీమవరం సర్కిల్ పరిధిలో 2, ఏలూరు టౌన్ సర్కిల్ పరిధిలో 3, కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్లో స్థానిక తూర్పు వీధికి చెందిన పాత నేరస్తులు యర్రవరపు ఫణిరాజా(19), మారగాని రవికుమార్ (19)తోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ముఠాకు నాయకుడూ మైనరే కావటం మరో విశేషం. వీరంతా ఏలూరు రామకృష్ణాపురంలో బైక్ దొంగిలించి, దాని నంబరు మార్చి ఆ వాహనంపై వెళుతూ చెయిన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారని వివరించారు. నిందితులను పట్టుకోవటంలో కృతకృత్యులైన హెడ్‌కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రవికుమార్, బాజీలకు ఆయన రివార్డులు అందచేశారు. సమావేశంలో డీఎస్పీ ఎం.రజని, ఏలూరు టూటౌన్ సీఐ కె.విజయపాల్ పాల్గొన్నారు. 
 
 ఛేదించాల్సిన కేసులు చాలా ఉన్నాయి : ఎస్పీ
 జిల్లాలో ఛేదించాల్సిన కేసులు అనేకం ఉన్నాయని, వాటిని కూడా ఛే దించి నేరాలను అదుపు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. గొలుసు దొంగతనాలకు పాల్పడేవారు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్పారు. వీధుల్లో పోలీసు గస్తీ ఎక్కువగా ఉండడంతో చిరునామాలు తెలుసుకునే నెపంతోనో, ఇల్లు అద్దెకు కావాలనే వంకతోనో ఇళ్లలోకి వెళ్లి మహిళల మెడల్లో గొలుసులు తెంపుకుపోతున్నారని వివరించారు. ఇటువంటి వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. 
 

Advertisement
Advertisement