అధ్యక్షా..సమస్యలు ఇవే!

9 Dec, 2019 10:07 IST|Sakshi

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 

జిల్లాలో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలు 

సభ దృష్టికి తీసుకెళ్తామంటున్న శాసనసభ సభ్యులు  

సాక్షి, కర్నూలు (రాజ్‌విహార్‌): ఐదేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే. అభివృద్ధి జాడలు వెతికినాకనిపించని వైనం. అప్పటి పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితం. ప్రభుత్వం మారింది. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అధికార పారీ్టకి చెందిన వారే కావడంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారంనుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 10 రోజుల పాటు జరిగే సమావేశాల్లో జిల్లా సమస్యలపై సభ్యులు గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో వేలాది మందికి ఉపాధిని కలి్పంచే ఓర్వకల్‌ ఇండస్ట్రియల్, కొలిమిగుండ్ల సిమెంట్‌ హబ్‌లపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, కర్నూలు నగరంతోపాటు పలు పట్టణాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని, కర్నూలు పెద్దాసుపత్రి స్థాయిని పెంచాలని కోరుతున్నారు. మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించి శాశ్వత ప్రతిపాదికన పరిష్కరించేలా నిధుల మంజూరుకు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.      

వేదావతి, గుండ్రేవులపై చర్చిస్తాం
కారి్మకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, కొత్త పథకాలు, అమలు తదితర అంశాలతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చిస్తాం. వేదావతి, ఆర్‌డీఎస్‌ కుడికాలువ, గుండ్రేవుల నిర్మాణాల గురించి సభ దృష్టికి తీసుకెళ్తాం. ఆలూరు నియోజకవర్గంలోని నగరడోణ, నగటూరు ప్రాజెక్టును పూర్తి చేయిస్తా. జిల్లాలోని పలు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రతిపాదికన చర్యలు చేపడతాం. – గుమ్మనూరు జయరాం, కారి్మక, ఉపాధి కల్పన మంత్రి 

పులికనుమ పూర్తి చేయాలి 
ఎమ్మిగనూరు పట్టణంలో తీవ్ర నీటి సమస్య ఉంటుంది. తుంగభద్ర నది పక్కనే ఉన్నా కష్టాలు తప్పడం లేదు. గాజులదిన్నెకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని తీసుకొస్తే ఎమ్మిగనూరు, కోడుమూరు పట్టణాలకు నీటి ఎద్దడి ఉండదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇప్పటికే ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. పులికనుమను పూర్తి చేసి తాగు, సాగునీరు సరఫరా చేయాలని కోరతా.  –కె. చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు 

ఆర్‌డీఎస్‌ కుడి కాల్వ నిర్మాణంపై మాట్లాడతా
మంత్రాలయం నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సభలో కోరుతా. కోసిగి తూము, ఆర్‌డీఎస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్, రాంపురం చానెల్, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ నిర్మాణ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మంత్రాలయం నియోజకవర్గంలో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. అసంపూర్తిగా ఉన్న పులికనుమ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతా. తుంగభద్ర నది ఒడ్డున ఉన్నా అన్ని మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. దీని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని   డిమాండ్‌ చేస్తా. 
–వై. బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే, మంత్రాలయం 

ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీపై మాట్లాడతా 
మా నియోజకవర్గంలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి పంట పొలాలకు నీరు పోయేందుకు కాలువలు పూర్తి చేయాలన్నదే నా ధ్యేయం. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఆత్మకూరులో మైనార్టీ కళాశాల ఏర్పాటు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ఆసుపత్రుల్లో వైద్య పోస్టుల భర్తీపై గళం విçప్పుతా. శ్రీశైలంలో నివాసం ఉంటున్న ప్రజలకు సున్నిపెంటలో స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలి. ఆలయ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగులరైజేషన్‌ కోసం పోరాడుతా. – శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే, శ్రీశైలం 
   
మరో ఎస్‌ఎస్‌ ట్యాంకు అవసరం 
కర్నూలు నగరంలో మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు మరో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ముందు చూపులేక వ్యహరించడంతో కర్నూలు నగరం వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంటోంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీటిని గాజులదిన్నెకు తరలించి అక్కడి నుంచి కర్నూలు తరలించేలా చర్యలు తీసుకుంటాం. నగరంలోని అవకాశం ఉన్న ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు, రోడ్లు, కాలువల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.    –హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్యే, కర్నూలు

హంద్రీనీనా నీటితో చెరువులు నింపాలి
పందికోన రిజర్వాయర్‌ నుంచి చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలని కోరుతా. మండలంలోని 32 వేల ఎకరాలకు నీటిని సరఫరా చేయాలి. గత టీడీపీ ప్రభుత్వం పంట కాలువలను తీయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రస్తావిస్తా. పత్తికొండ, మద్దికెర, వెల్దుర్తిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తావిస్తా. రైతుల కష్టాలు పరిష్కరించడం, మద్దతు ధర కలి్పంచాలని విన్నవిస్తాం. 
–శ్రీదేవి, ఎమ్మెల్యే, పత్తికొండ 

డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి
కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ముఖ్యంగా కోడుమూరులో డిగ్రీ కళాశాల, కొత్తపల్లి–గోరంట్ల మధ్య హంద్రీపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరుతా. వృత్తి విద్య కోసం ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గూడూరు, కొత్తకోట, మునగాల మధ్య రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం  రూ.కోటి మంజూరు చేసింది. దీనితో ప్రధానంగా నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాము.   –జరదొడ్డి సుధాకర్, ఎమ్మెల్యే, కోడుమూరు 

తెలుగుగంగ పనులు పూర్తి చేయాలి
తెలుగుగంగ లైనింగ్‌ పనులు పూర్తి చేయాలి. నీటి వృథాని అరికట్టి రైతులకు అందించాలి. కేసీ కెనాల్, తెలుగు గంగల కింద చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం. అందుకోసం రెండు ప్రధాన కాలువలకు లైనింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా. జిల్లాలో జరిగిన నీరు–చెట్టు పనుల అవినీతిపై విచారణకు డిమాండ్‌ చేస్తా. ఆళ్లగడ్డ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతా.   
–గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ

పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలలి
నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతా.  అన్ని గ్రామాల్లో తాగు, సాగునీటి కష్టాలు ఉన్నాయి. వీటిని సభ దృష్టికి తీసుకెళ్తా. నందికొట్కూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి కృషి చేస్తా.  – తొగురు ఆర్థర్, ఎమ్మెల్యే, నందికొట్కూరు 

దద్దనాల ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలి 
బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న దద్దనాల ప్రాజెక్టుకు డోన్‌ మండలం కొచ్చెర్వు నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీటిని ఇస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. దీనికి అటవీ శాఖ అనుమతులు అవసరం. ఈ క్లియరెన్స్‌ ఇప్పించాలి. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుతా. అవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకోవాలి.  –కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్యే బనగానపల్లె 

కుందూ వెంట ఫ్లడ్‌ వాల్‌  నిర్మించాలి
ఎప్పుడు వరదలు వచ్చినా నంద్యాల పట్టణం ముంపునకు గురవుతుంది. సమస్య పరిష్కారానికి కుందూనది వెంట ఫ్లడ్‌వాల్‌ నిర్మాణం చేపట్టాలని సభ దృష్టికి తీసుకెళ్తా. గతంలో ఈ ఫ్లడ్‌ వాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా మధ్యలో ఆగిపోయింది. వెలుగోడు నుంచి చేపట్టిన రక్షిత మంచినీటి పథకం నిధులు లేక పనులు ఆగిపోయాయి. ఈ నిర్మాణాలను పూర్తి చేయాలి. టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రచారం కోసమే పనులు చేపట్టి కాంట్రాక్టర్లకు  పైసా విడుదల చేయలేదు.  – శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నంద్యాల  

రహదారుల విస్తరణ చేపట్టాలి 
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా. గ్రిడ్‌ ద్వారా మంచినీటి సమస్య పరిష్కరించాలి. పెండింగ్‌లోని బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని, మండగిరి తహసీల్దార్‌ తాగునీటి పథకం, పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని సభలో ప్రస్తావిస్తా.  ఎస్‌ఎస్‌ ట్యాంకుల నిర్వహణ, విస్తరణకు చర్యలు చేపట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్తా.  – సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆదోని

జీవో 69పై మాట్లాడుతా
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు న్యాయం చేయాలని జారీ చేసిన జీఓ నంబర్‌ 69పై మాట్లాడుతా. ఓర్వకల్, గడివేముల, కల్లూరు మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తా. హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతా. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా. ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తే రైతన్నలకు సాగునీటి కష్టాలు ఉండవు. 
–కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పాణ్యం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా