Sakshi News home page

మున్సిపల్ సమ్మెను పరిష్కరించాలి

Published Sat, Jul 25 2015 12:54 AM

Municipal strike solve

కాకినాడ సిటీ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు వారాలుగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్మికులు.. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. వారి ఆందోళనకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. మూడు గంటలపాటు జరిగిన ఆందోళన అనంతరం కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకూ ప్రదర్శన చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో కేవలం రూ.1600 నుంచి రూ.8000 వరకూ జీతాలు తీసుకుంటూ సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులు అప్పుల పాలవుతున్నారన్నారు.
 
 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామంటున్న పాలకులు.. పారిశుధ్యం లేకుండా నగరాలు ఎలా స్మార్ట్‌గా ఉంటాయో చెప్పలగలరా అని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు.. కార్మికులను బెదిరిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పుష్కరాలు అయిన వెంటనే సమ్మె పరిష్కారానికి పూనుకోకపోతే అన్ని సంఘాలూ, పార్టీలూ ఏకమై రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.బేబీరాణి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ నాయకులు కె.సత్తిబాబు, సీఐటీయూ నాయకులు ఎం.వేణుగోపాల్, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు మీసాల అనంతరావు, బొబ్బిలి సత్యనారాయణ, తుపాకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement