మద్యం లెసైన్స్‌దారులు నిబంధనలు పాటించాలి | Sakshi
Sakshi News home page

మద్యం లెసైన్స్‌దారులు నిబంధనలు పాటించాలి

Published Thu, Nov 27 2014 2:45 AM

మద్యం లెసైన్స్‌దారులు నిబంధనలు పాటించాలి - Sakshi

సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ డీసీ విజయకుమారి

కడప అర్బన్ : జిల్లాలోని 209 మద్యం షాపుల యజమానులు, 17 బార్ల యజమానులు ఎక్సైజ్‌శాఖ నిర్దేశించిన నిబంధనలను తప్పక పాటించాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. బుధవారం రాత్రి తమ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి షాపు యజమాని హోలోగ్రామ్ యంత్రాలను తప్పక తమ షాపులో వినియోగించుకోవాలన్నారు.

జిల్లాలో 209 వైన్ షాపులకుగాను ఇప్పటికే 208 షాపుల వారు హోలోగ్రామ్ యంత్రాలను అద్దెకు తీసుకున్నట్లు సంబంధిత సీఐలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే 17 బార్లలో 16 బార్ల యజమానులు హోలోగ్రామ్ యంత్రాలను అద్దెకు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ గతేడాది నవంబరు నెలలో, ఈ ఏడాదిలో ఈనెల 26వ తేదీ వరకు మొత్తం మద్యం అమ్మకాలపై సమీక్ష నిర్వహించామన్నారు.

2013 నవంబరులో 1 లక్ష 34 వేల 231 కేస్‌ల మద్యం, 55,532 కేస్‌ల బీరు కొనుగోలు చేశారని, తద్వారా రూ. 49.31 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది ఈనెల 26వ తేదీ వరకు 93,995 కేస్‌ల మద్యం, 51,044 కేస్‌ల బీరును కొనుగోలు చేశారని, తద్వారా రూ. 37.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నాలుగు రోజుల్లో మరింత ఆదాయం వచ్చేందుకు లెసైన్స్‌దారులకు అధికారులు సూచించాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, ప్రొద్దుటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభుప్రసాద్, ఏఈఎస్‌లు బాబు శ్రీధర్, బాలకృష్ణన్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement