Sakshi News home page

అధికారిక అవినీతి!

Published Wed, Mar 23 2016 11:02 PM

అధికారిక  అవినీతి!

మురిగిపోకుండా అడ్వాన్స్
రికార్డింగ్ పేరుతో నిధులు డ్రా
పనులు కాకుండానే ఎం బుక్కుల్లో నమోదు
మెటీరియల్ పేరుతో నిధులు పక్కదారి
మండల ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు
పనులు చేయకుండా బిల్లులు డ్రా చేస్తే ఎక్కడ ఇరుక్కుంటామోనని ఆందోళన
{పభుత్వమే ఒత్తిడి తెస్తోందంటున్న  ఉన్నతాధికారులు

ఓచర్లు  తయారవుతున్నాయి.. బిల్లులు చకచకా రెడీ అయిపోతున్నాయి.. పనులు జరక్కుండానే డ్రా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులను అడ్డంగా బొక్కేందుకు ఇటు అధికారులు.. అటు అధికార పార్టీ నేతలు చాపకింద నీరులా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఏ విధంగా డ్రా చేయాలి.. ఏ విధంగా సొమ్ము చేసుకోవాలనే అంశంపై బుధవారం క్షేత్ర స్థాయి ఇంజినీర్లకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

 

విశాఖపట్నం: ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రాష్ర్ట వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో రూ.400 కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి ఉంది. ఒక్క విశాఖలోనే రూ.150 కోట్లకు పైగా ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది.  ఏటా మురిగిపోతున్న ఈ నిధులను ఈసారి ఎలాగైనా వెనక్కి మళ్లనీయకుండా ఉండాలన్న పట్టుదలతో పంచాయతీలకు ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా చేర్చి గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. తొలుత 50ః50 నిష్పత్తిలో, ఆ తర్వాత 30ః70 నిష్పత్తిలోనూ.. చివరకు 10ః90 నిష్పత్తి చొప్పున మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఖర్చు చేసేందుకు రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో ప్రతిపాదించారు. ఈ విధంగా పంచాయతీల్లో  14వ ఆర్థిక సంఘం నిధులకు రూ.278 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ నిధులను జతచేర్చి ఏకంగా 650 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టేందుకు 6150 పనులను ప్రతిపాదించారు. మార్చి-31కల్లా కనీసం 300 కిలోమీటర్ల మేరైనా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు ఆదరాబాదరాగా 260 కిలోమీటర్ల మేర 1200 వరకు పనులు పూర్తిచేసినట్టుగా లెక్క తేల్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.98 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు చేయగా.. మరో రూ.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.


ప్రారంభంకాని రూ.140 కోట్ల పనులు
మిగిలిన రూ.140 కోట్లకు సంబంధించిన పనుల్లో ఎక్కడా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. అయినా సరే ప్రారంభమైనట్టుగా అడ్వాన్స్ రికార్డింగ్ చేసి ఎం బుక్‌లో నమోదు చేయాలంటూ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఏఈలు, మండల ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పనులు జరక్కుండానే ఏ విధంగా బిల్లులు తయారు చేయాలి. ఏ విధంగా అడ్వాన్స్ రికార్డింగ్ చేయాలి.. ఏ విధంగా ఎంబుక్‌ల్లో నమోదుచేయాలి వంటి విషయాలపై బుధవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో వారికి ప్రత్యేక క్లాస్ కూడా తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిధులు వెనక్కి మళ్లిపోవడానికి వీల్లేదని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయనని.. అవసరమైతే నిబంధనలను పక్కన పెట్టి అడ్వాన్స్ రికార్డింగ్‌తో నెలాఖరులోగా నిధులన్నీ డ్రా చేసి తీరాలని వారికి తేల్చి చెప్పారు. ఇందుకోసం మెటీరియల్ కొన్నట్టుగా ఓచర్లు సృష్టించి బిల్లులు డ్రా చేయాలని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే డ్రా చేసిన రూ.98 కోట్లకు సంబంధించిన పనులు కాని.. ఇంకా డ్రా చేయాల్సి ఉన్న రూ.40 కోట్లకు సంబంధించిన పనులు కానీ నూటికి నూరు శాతం పూర్తి కాని పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి.

 

నిబంధనలు కఠినంగా ఉన్నా
..
నిబంధనలను పక్కన పెట్టి అడ్డదిడ్డంగా సీసీ రోడ్లు నిర్మించారే తప్ప.. ఎక్కడా బెర్ములు, డ్రైన్లు  నిర్మించిన పాపాన పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిబంధనలు   కఠినతరం చేశారు. ఎం-30 స్టాండర్డ్ (ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక)లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్డు లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో కానీ, వాటర్ ప్యూరింగ్‌లో కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25 వేల చొప్పున కోత పెట్టొచ్చు.. పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలే కాదు తీవ్రతను బట్టి క్రిమినల్ చర్యలు కూడా  తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు ఇంతలా ఉన్నప్పటికీ వీటిని పక్కన పెట్టి బిల్లులు డ్రా చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మండల ఇంజినీరింగ్ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులు కావడంతో  పనులు జరక్కుండా బిల్లులు డ్రాచేస్తే తాము అడ్డంగా ఇరుక్కుంటామని ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్, మోటనరింగ్ కమిటీతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా ఈ పనులను నిశితంగా పరిశీలిస్తుందని.. బిల్లుల్లో కానీ, పనుల నాణ్యతలో కానీ ఏ చిన్న తేడా వచ్చినా తమ బతుకులు రోడ్డున పడ్డట్టేనని నర్సీపట్నం డి విజన్‌కు చెందిన ఓ మండల ఇంజినీరింగ్ అధికారి సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా సరే మేం చూసుకుంటాం.. బిల్లులు పెట్టండి.. సొమ్ములు డ్రా చేయండంటూ ఎస్‌ఈ, ఈఈలు తమపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఏం చేయాలో   పాలుపోవడం లేదని వాపోతున్నారు.

 
ప్రభుత్వం నుంచి ఒత్తిడి: సంబంధిత జిల్లా అధికారులను వివరణ కోరితే ప్రభుత్వం నుంచి తమపై కూడా అదే రీతిలో ఒత్తిళ్లు వస్తున్నాయని.. తామేం చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ నెలాఖరులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసినట్టుగా ఎంబుక్‌ల్లో నమోదు చేసి మొత్తం నిధులు స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైనట్టు  తెలిసింది.

 

Advertisement

What’s your opinion

Advertisement