రచ్చబండ కార్డులకు కిరోసిన్ ఏదీ ? | Sakshi
Sakshi News home page

రచ్చబండ కార్డులకు కిరోసిన్ ఏదీ ?

Published Sun, Jan 19 2014 5:06 AM

no blue kerosene to rachabanda cards

గుడివాడ, న్యూస్‌లైన్ : రచ్చబండలో రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు రెండు నెలలైనా నీలి కిరోసిన్ అందడం లేదు. తెల్ల కార్డులు ఇచ్చి తమను గాలికొదిలేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో వంట చేసుకోవడానికి, ఇంట్లో దీపాలు వెలగించుకునేందుకు సైతం వారు ఇబ్బందులు పడుతున్నారు.

 59,920 మంది లబ్ధిదారులు...
 గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండేళ్ల క్రితం తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులు అందజేశారు. జిల్లాలో 59 వేల 920 మందికి ఈ కార్డులు అందాయి. వీరందరికీ గత నెలలోనే రేషన్ సరకులు అందాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, డీలర్ల అలసత్వం ఫలితంగా అనేకచోట్ల కొత్త కార్డులు పొందినవారికి డిసెంబర్ రేషన్ సరకులు అందలేదు. మరికొన్నిచోట్ల లబ్ధిదారులకు కార్డులు కూడా చేరలేదని సమాచారం.

 జనవరిలో అన్ని రేషన్ సరకులు ఇచ్చినా డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన నీలి కిరోసిన్ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఈ కార్డులకు జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష లీటర్లకు పైగా కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కిరోసిన్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉం దని, ఎక్కడా ఇంతవరకు సరఫరా కాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త కార్డులకు కిరోసిన్ సబ్సిడీ విడుదలైతేనే కోటా కేటాయింపులు జరుగుతాయని అధికారులు సమాధానం ఇస్తున్నారు.

 నిరుపేదల అవస్థలు...
 సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే కరెంటు కోత తో దీపాలు వెలిగించటానికి, ఇంట్లో వంట చేసుకునేందుకు కావాల్సిన కిరోసిన్‌ను బహిరంగ మార్కెట్‌లో లీటరు రూ.40తో కొంటున్నామని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కొత్త కార్డుదారులకు నీలి కిరోసిన్ అందేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement