గాలిలో వైద్యం | Sakshi
Sakshi News home page

గాలిలో వైద్యం

Published Tue, Dec 24 2013 2:35 AM

no medical services to toxic fevers, dysentery victims

 సాక్షి, కడప: జిల్లాలో ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల విరేచనాలతో పాటు జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఈ సీజన్‌లో 237 విషజ్వరాలు, 281 టైఫాయిడ్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. వాస్తవానికి ఈసంఖ్య వేలల్లోనే ఉంది. మొత్తం బాధితుల్లో అధిక శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 72 పీహెచ్‌సీలు, 6 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. 600కుపైగా ప్రైవేటు క్లీనిక్‌లు ఉన్నాయి. ప్రైవేటు క్లీనిక్‌లలో రోగులు ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ సంఖ్యలో క్యూలో ఉంటున్నారు. ఈ ఏడాది విషజ్వరాలతో ఇద్దరు ప్రాణాలు వదిలినా వైద్య, ఆరోగ్యశాఖ స్పందించడం లేదు.
 వాస్తవ  పరిస్థితి ఇది:
 జిల్లా వ్యాప్తంగా 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 34 ఉన్నాయి. పీహెచ్‌సీల్లో ఉదయం 9-12, మధ్యాహ్నం 2-4 గంటల వరకూ ఓపీ నిర్వహించాలి. అయితే చాలా ఆస్పత్రుల్లో 12 గంటలకే డాక్టర్లు ఓపీ పూర్తి చేసి ఇంటిబాట పడుతున్నారు. పైగా వీరంతా పది తర్వాత ఆస్పత్రులకు వస్తున్నారు. అంటే కేవలం 2గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ మంది చిత్తశుద్ధిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు రోగాలతో అల్లాడుతున్న పల్లెలకు వెళ్లాల్సిన ఏఎన్‌ఎంలు ఉదయం అలా వెళ్లడం, మధ్యాహ్నం లోపు ఇంటికి వెళుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం 4గంటల వరకూ 85 శాతం మంది ఏఎన్‌ఎంలు ఉండటం లేదని తెలుస్తోంది.
 పీహెచ్‌సీలు ఎలా ఉన్నాయంటే:
 ఉదయం ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యపరీక్షలు అందడం లేదు. డాక్టరు రక్తపరీక్షలు రాసిస్తే కచ్చితంగా ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. పీహెచ్‌సీలలో సుమారు 15 రకాల పరీక్షలు నిర్వహించాలి. అయితే రక్త, మూత్ర పరీక్ష, మలేరియా లాంటి పరీక్షలు మినహా తక్కిన వాటికి ప్రైవేటుల్యాబ్‌లకు వెళ్లాల్సిందే! ఇదేంటని ఆరాతీస్తే పూర్తిస్థాయిలో పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేవని ల్యాబ్‌అసిస్టెంట్లు చెబుతున్నారు.

వీటిని ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. నిత్యం వందలాది మంది రోగులు వచ్చే ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో షుగర్,హెచ్‌ఐవీ, పచ్చకామెర్లు, వీడీఆర్‌ఎల్, వైడల్(టైఫాయిడ్) లాంటి పరీక్షలు చేయడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను వెళుతున్నారు. ఆస్పత్రికి రోగులు వెళితే ర క్తపరీక్షలు చేయించుకురావాలని చెబుతున్నారు. లేదంటే మందులు ఇవ్వడం, పీహెచ్‌సీల్లో లేకుంటే రాయించి పంపడం చేస్తున్నారు. అధికశాతం పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సులే  వీటిని చూస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత రోగులు ఆస్పత్రికి వస్తే డాక్టర్లు ఉండని పరిస్థితి నెలకొంది.
 నిధులు ఉన్నా ఫలితం లేదు:
 పీహెచ్‌సీల నిర్వహణకు లక్ష, మందులు ఇతర వాటికి 75వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటితో పరీక్షలకు అవసరమైన కి ట్లు కొనుగోలు చేయాలి. ఈ కిట్ల ధర  ఎక్కువగా ఉండటం, ఇచ్చే నిధులు తక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడం లేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement