విభజనపై స్పష్టత ఏదీ!? | Sakshi
Sakshi News home page

విభజనపై స్పష్టత ఏదీ!?

Published Sun, Sep 8 2013 2:01 AM

No vertex resolution?

సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ఆత్మగౌరవ బస్సుయాత్ర లక్ష్యమేమిటో అర్థంకాక సమైక్యవాదులు తలలుపట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజనపై తన వైఖరేమిటో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అసలాయన  రాష్ట్రాన్నివిభజించాలని కోరుకుంటున్నారో లేక సమైక్యంగా ఉంచాలనుకుంటున్నారో ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆయన ప్రసంగాల్లో తొమ్మిదేళ్ల తన పాలనలో చేసిన ప్రగతిని ఏకరువు పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమైక్య రాష్ట్ర పరిరక్షణపై ఒక్క ముక్కా మాట్లాడడం లేదు. మరి అలాంటప్పుడు ఈ ఆర్భాటపు యాత్రలెందుకని సమైక్యవాదులు మండిపడుతున్నారు. సొంత పార్టీవారు సైతం బాబు రొటీన్ ప్రసంగంపై పెదవివిరుస్తున్నారు.
 
తెలుగుతమ్ముడికి తన్నులు..

 చంద్రబాబు బస్సుయాత్రలో టీడీపీ కార్యకర్తలు ఓ తెలుగు తమ్ముడిని కుమ్మేశారు. చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే... రాష్ట్ర విభజన గురించి మాట్లాడవచ్చు కదా.. అని ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త బహిరంగంగా అన్నాడు. పక్కనే ఉన్న మరికొందరు కార్యకర్తలు సొంత పార్టీవాడని కూడా చూడకుండా అతడిపై పిడిగుద్దులు కురిపించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం పోలీసులు వారిని శాంతిపజేశారు.
 
దీక్షలంటే చులకనా..

సమైక్యాంధ్రకు మద్దతుగా వారం రోజులుగా ఆగిరిపల్లి, నూజీవీడుల్లో రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఆగిరిపల్లి సెంటర్‌లో ఉపాధ్యాయులు శనివారం రిలే దీక్ష చేపట్టారు. అదే సెంటర్‌లో చంద్రబాబు సభ ఏర్పాటుచేయడంతో ఆయన సాయంత్రం  సభ ప్రారంభించే ముందు తమ వద్దకు వచ్చి సంఘీభావం తెలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేస్తారని భావించారు. ఆ మేరకు కొంతమంది నేతను అధినేతను ఒప్పించేందుకు యత్నించారు. అయితే కేవలం దీక్ష శిబిరాన్ని వాహనంపై నుంచే తిలకించి వెళ్లిపోయారే తప్ప  కనీసం సంఘీభావం చెప్పే ప్రయత్నం చేయలేదు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడులోనూ దీక్ష చేస్తున్న వారిని చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఆయన ప్రసంగం సాగుతున్నంతసేపు దీక్ష చేస్తున్న వారు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
 
అర్ధరాత్రి వరకు యాత్ర..

 పాదయాత్ర తరహాలోనే బస్సుయాత్రను కూడా చంద్రబాబు అర్ధరాత్రి పూట ప్రజలు లేనప్పుడు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బస్సు దిగి బయటకొచ్చాక నిదానంగా యాత్ర సాగుతోంది. శనివారం రాత్రి 11 గంటల వరకు యాత్ర సాగింది. కార్యకర్తలు, నాయకులు అసహనానికి గురవుతున్నారు. పాతిక మంది గ్రామస్తులు కనపడినా చంద్రబాబు ఆపకుండా అరగంట సేపు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుంటే పక్కనున్న నాయకులే చికాకు ప్రదర్శిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను ప్రస్తావించినప్పుడు  ఆగిరిపల్లికి చెందిన ఒక  మహిళ ఉల్లిపాయల దండను బాబుకు వేసి నిరసన తెలియచేసింది. సమైక్యాంధ్రపై తన వైఖరిని స్పష్టం చేయకుండా చంద్రబాబు  ఆత్మగౌరవ యాత్ర  నిర్వహించడంపై నూజివీడు జేఏసీ నిరసన తెలిపింది. సభ జరుగుతున్నంతసేపూ చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూనే ఉన్నారు.
 

Advertisement
Advertisement