రగులుతున్న రాజధాని ఉద్యమం | Sakshi
Sakshi News home page

రగులుతున్న రాజధాని ఉద్యమం

Published Sat, Feb 22 2014 3:36 AM

Note the movement of capital

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలపడంతో సీమాంధ్రలో కొత్త రాజధానిపై ఉద్యమాలు మొదలయ్యాయి. ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలుకు అవకాశం ఇవ్వాలని జిల్లా ప్రజలు పట్టుబడుతున్నారు.  విద్యార్థి సంఘాలతోపాటు, పలు ప్రజా సంఘాల నాయకులు ఈ మేరకు ఆందోళనలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది.  కేంద్ర హోంశాఖ వర్గాలు సీమాంధ్రలోని పలు ప్రాంతాల గురించి ఆరా తీయటం ప్రారంభించాయి. అందులో కర్నూలు జిల్లా పేరు ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది. దేశంలో 1952లో మొదటి సారిగా లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తరువాత 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేశారు. కొందరు పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం కర్నూలుకు అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంపికచేశారు. జిల్లా వాసులకు కన్నీరు మిగిల్చారు. ఆ తరువాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. పలు రంగాలకు చెందిన వారంతా ఆశలన్నీ హైదరాబాద్‌పైనే పెట్టుకుని జీవించారు. తిరిగి ప్రత్యేక తెలంగాణ  ఉద్యమంతో రాష్ట్రాన్ని రెండుగా చీల్చారు. హైదరాబాద్ నుంచి వేరు చేసి సీమకు మరోసారి గొంతు కోశారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు.
 
 రైతులకు నీటి వాటాలో తీరని అన్యాయం జరుగనుంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమకు అన్యాయం జరుగకుండా ఉండాలంటే కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రాయలసీమ అభివృద్ధి కోసం సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ, నిమ్స్, అంతర్జాతీయ మెట్టపొలాల పరిశోధన కేంద్రం, అంతర్జాతీయ అగ్నికల్చర్ ఇరిగేషన్ సంస్థ, అంతర్జాతీయ ఫార్మసి పరిశోధన సంస్థ, రాయలసీమలో ఉన్న ఖనిజసంపదల అనుసంధానంగా నూతన పరిశ్రమల కోసం, విశ్వవిద్యాలయాల అబివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించాలని డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.
 
 ఉద్యమానికి శ్రీకారం....
 సీమాంధ్ర రాజధానిగా కర్నూలును ప్రకటించాలనే డిమాండ్‌తో కర్నూలు వాసులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య శుక్రవారం ఆందోళనకు దిగింది. వీరే కాకుండా మొదటి నుంచి రాజధాని కోసం మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారిలో తెలుగు వికాస ఉద్యమకారులు, కల్కూర, సీమ జనతాపార్టీ తదితరులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. వీరితో పాటురాయలసీమ యునెటైడ్ ఫ్రంట్, రాయలసీమ యూత్ ఫ్రంట్ నాయకులు ఉద్యమబాట పట్టారు.  
 

Advertisement
Advertisement