Sakshi News home page

ఇకపై పల్లెలు పరిశుభ్రం

Published Tue, Jan 28 2014 2:39 AM

now onwards villages will be clean

 మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ :
 పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు.. పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.. పట్టణాల కంటే పల్లెలే ఎంతో మేలు.. ఇలాంటి వాక్యాలు మనం ఎన్నో సందర్భాల్లో చదివాం. విన్నాం. కానీ వర్షాకాలం వచ్చిందం టే పల్లెల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే పారిశుధ్య లోపం. ఎక్కడ చూసినా చెత్తాచెదారం. పూడికతో నిండిన డ్రెయినేజీలు, శుభ్రంగా లేని రోడ్లు, మరుగుదొడ్లు లేని ఇళ్లు. ఇలాంటి వాతావరణమే ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తోంది. దీంతో పట్టణాలకు వలస వెళ్లిన వారు పల్లెలకు రావాలంటేనే జంకుతున్నారు. పారిశుధ్యలోపం, చెత్తతో దోమల విజృంభన, సీజనల్ వ్యాధుల దాడి, మరుగుదొడ్లు లేని ఇళ్లు, అసౌకర్యాలు కనుమరుగు కానున్నాయి. కొద్ది రోజుల్లో పరిశుభ్రానికి ‘ఉపాధి’ బాటలు వేయనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లోనే ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తారని తెలుసు.. ఇకపై గ్రామాల్లోని చెత్తను తొలగించేందుకు ప్రతీ పంచాయతీలో ఉపాధిహామీ పథకం ద్వారా చెత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిం చారు. జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.9100 ప్రభుత్వం అందిస్తుండగా లబ్ధిదారు వాటాగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతీ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు 866 జీపీల్లో చెత్త డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో స్థల సేకరణ చేసి, పనులు కూడా ప్రారంభించారు. పల్లెల అభివృద్ధికి పాటుపడాలనుకునే సర్పంచులకు ఇది చక్కని అవకాశం.
 
 డంపింగ్ యార్డు ఏర్పాటు ఇలా..
 ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తారు. ముందుగా ప్రభుత్వ/పంచాయతీకి చెందిన 7 గుంటల భూమిని, గ్రామానికి 500 మీటర్ల నుంచి కిలోమీటరు దూరంలో గుర్తిస్తారు. భూమి ఎత్తయిన ప్రదేశంలో ఉండేలా చూడడం వల్ల వర్షపు నీరు చెత్తలోకి రాకుండా ఉంటుంది. 15 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల గుంతను తవ్వుతారు. చెత్త వేసేందుకు, రిక్షాలు, తోపుడు బండ్లు డంపింగ్ యార్డుకు చేరుకోవడానికి దారి, ర్యాంపు ఏర్పాటు చేస్తారు. గుంతగా తవ్విన మట్టిని చెత్తలోకి నీరు వెళ్లకుండా కట్టలా పోస్తారు. ఈ పనులన్నీ ఉపాధిహామీ కూలీల ద్వారా చేపడతారు. డంపింగ్ యార్డు ఏర్పాటు పనుల వల్ల 180 రోజుల పని దొరుకుతుంది. కూలీ కింద ఒక్కో డంప్ యార్డుకు రూ.1,16,888, మెటీరియల్‌కు రూ.7,152 చెల్లిస్తారు. డంపింగ్ యార్డు పూర్తయిన తర్వాత ఉపాధికూలీలతో గ్రామాల్లోని చెత్తను నెలలో 15 రోజులపాటు సేకరించడం, 4 రోజులపాటు డంపింగ్ యార్డులోకి తరలించడం చేస్తారు.
 
 నిర్వహణ తీరు..
 ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణకు ప్రత్యేకంగా కార్మికులు లేరు. ప్రభుత్వం చేపట్టే పారిశుధ్య వారోత్సవాల్లోనే చెత్తాచెదారం తొలగించడం, గ్రామాల్లోని కాలనీలను శుభ్రపరచడం చేసేవారు. ఏడాదికి నాలుగైదు సార్లు గ్రామంలోని చెత్త తొలగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. నిధుల లేమి, కార్మికుల కొరతతో ఇన్నాళ్లు చెత్త సేకరణకు ప్రత్యేకంగా కార్మికులను పంచాయతీల్లో నియమించలేదు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు కార్మికులను ఏర్పాటు చేసినట్లే, ఇక నుంచి గ్రామాల్లో కూడా చెత్త సేకరణ కోసం ఉపాధిహామీ కూలీలను నియమిస్తారు. వీరు వారంలో 3 సార్లు ఇంటింటికి వెళ్లి చెత్త పోగు చేస్తారు. దీన్ని రిక్షా/తోపుడు బళ్ల ద్వారా తరలించి డంపింగ్ యార్డులో పోస్తారు. చెత్త సేకరించినందుకు ఒక్కో కూలీకి రోజుకు రూ.149 చెల్లిస్తారు. ఇలా ఏడాదిలో 180 పనిదినాలకు ఉపాధి లభిస్తుంది. చెత్తను డంప్‌యార్డుకు తరలించేందుకు రూ.7వేలు అదనంగా లభిస్తుంది. పోగు చేసిన చెత్తాచెదారం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. డంప్ నిండిన తర్వాత దాన్ని ఎరువుగా మార్చి వేలం పాట ద్వారా విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఇవి గ్రామపంచాయతీ అభివృద్ధికి ఉపయోగించవచ్చు.
 
 
 

Advertisement
Advertisement