పణంగా గోదావరి డెల్టా? | Sakshi
Sakshi News home page

పణంగా గోదావరి డెల్టా?

Published Wed, Nov 15 2017 11:05 AM

officer negligence to Inflowers Godavari delta - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతలతో మరోసారి గోదావరి డెల్టాను పణంగా పెట్టనున్నారా? పశ్చిమగోదావరి నీటిపారుదల సలహామండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదు. గోదావరిలో ఇన్‌ఫ్లోలు తగ్గిపోయినా ఇంకా ఎందుకు పట్టిసీమ నుంచి నీటిని నిలిపివేయడంలో తర్జనభర్జన పడుతున్నారు. ఎవరి వత్తిళ్లు అధికారులపై పని చేస్తున్నాయి. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల మాటకు విలువ లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. గత నెల 31న ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కృష్ణా ఆయకట్టు కోసం మరోసారి గోదావరి డెల్టా రైతాంగాన్ని పణంగా పెట్టవద్దని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. గోదావరి నుంచి ఇన్‌ఫ్లోలు తగ్గే సమయంలోనే పట్టిసీమ నుంచి నీటిని నిలిపివేయాలని, లేనిపక్షంలో గోదావరి డెల్టాలో రబీ సాగు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు. 

2015లో డెడ్‌స్టోరేజి వరకూ తోడివేయడంతో రబీ సాగుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన విషయం ఆయన గుర్తు చేశారు. ఇన్‌ఫ్లో 18 వేల క్యూసెక్కులకు రాగానే నీటిని నిలిపివేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 14 మీటర్ల కన్నా ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడే పట్టిసీమకు నీరు ఇస్తామని తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో, వ్యవసాయ శాఖ, ఇంజనీరింగ్‌ శాఖ అధికారుల్లో కూడా పలు అనుమానాలు ఉన్నాయని అందరు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రబీ పంటకు నీటి లభ్యత 72 శాతమే ఉందని వంతుల వారీ విధానంలో నీటిని విడుదల చేద్దామని ఒకవైపు ప్రణాళిక రూపొందించుకుంటూనే మరోవైపు గోదావరిలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 13 వేలకు పడిపోయినా ఇంకా పట్టిసీమను ఆపకుండా కొనసాగించడం విమర్శలకు దారి తీస్తోంది.

 గత ఏడాది ఆరు నెలల కాలంలో 55.60 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ 98.70 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం పట్టిసీమ వద్ద నీటిమట్టం 14.2 మీటర్లు ఉంది. 14 మీటర్ల వరకే పట్టిసీమకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులుగా నీటిమట్టంలో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. దీంతో కొన్ని మోటార్లను తగ్గించడం, పెంచడం ద్వారా నీటిని నిరాటంకంగా పట్టిసీమ ద్వారా విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నీటి మట్టం తగ్గిపోయినప్పటికీ ఈ నెల 16న ఎమ్మెల్యేల పర్యటన ఉండటంతో వారికి చూపించడం కోసం 16 వరకూ నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత దశలవారీగా పట్టిసీమను నిలుపుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

ఈ ఏడాది వరదనీటి ప్రవాహం గోదావరిలో 17 టీఎంసీలు మాత్రమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 50 టీఎంసీల వరకూ సీలేరు జలాలను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం నీటిమట్టం పడిపోతుండటంతో రబీకి ఈసారి సమస్యలు తప్పవనే అందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం 12 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉండటంతో ఏడు వేలు పట్టిసీమకు, మూడువేలు డెల్టాకు ఇచ్చి రెండువేల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. వస్తున్న నీటిని డెల్టాకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ మిగులు జలాలు ఉన్నట్లు చూపించడం కోసం ప్రతిరోజూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement