ఒక ఉద్యోగి.. రెండు వేతనాలు.. | Sakshi
Sakshi News home page

ఒక ఉద్యోగి.. రెండు వేతనాలు..

Published Fri, Sep 20 2013 2:13 AM

one employee getting  double salaries

 ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:
 నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) ఇంజినీరింగ్‌శాఖలో తవ్వేకొద్దీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఒక అవినీతిపై విచారణ చేపడుతుంటే మరో అవినీతి బాగోతం బయటకొస్తోంది. రూ.65 లక్షల అవినీతి వెలుగుచూడటంతో  ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారం మరువకముందే... మరొకటి గురువారం బయటపడింది. ఒక ఉద్యోగి రెండు వేతనాలు పొందుతూ రూ.16 లక్షలు స్వాహా చేయడాన్ని ఆడిట్‌లో గుర్తించారు. ఇదంతా ఒక్క ఏడాదిలో జరిగిన అవినీతి కాదు. ఐదేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా గుర్తించేనాథుడే లేకపోవడం అక్రమాలకు పరాకాష్టగా చెబుతున్నారు.
 
 ఎలా జరిగింది..?
 ఒక ఉద్యోగికి అందరితో పాటు నేరుగా వేతనం ఇస్తున్నారు. అదనంగా ఆ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో అంతే మొత్తం జమచేస్తున్నారు. ఇంత బహిరంగంగా నిధులు స్వాహా అవుతున్నా సంబంధిత డ్రాయింగ్ అధికారులు మిన్నకుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వారి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని పలువురు అంటున్నారు. ఇప్పటికే రోజుకో అవినీతి బాగోతంతో అబాసుపాలవుతున్న ఎన్నెస్పీకి ఈ ఘటనో పెద్ద కుదుపునిచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఖమ్మంలోని ఎన్నెస్పీ మానిటరింగ్ డివిజన్ కార్యాలయం నుంచి సుమారు 200 మందికి పైగా ఉద్యోగులకు, ఎన్.ఎం.ఆర్‌లుగా పని చేస్తున్న వారికి జీతాలు చెల్లిస్తారు. డివిజన్ పరిధిలోని నల్లగొండ జిల్లా హూజూర్‌నగర్ సబ్ డివిజన్‌లో వెంకటకృష్ణ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2009 ఏడాది నుంచి 2013 మార్చి వరకు ఖమ్మం ఇరిగేషన్ కార్యాలయం నుంచి నెలకు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. అదే సమయంలో అంతేమొత్తం వేతనాన్ని ఆయనకు నేరుగా ఇస్తున్నారు.
 
 ప్రతినెలా ఉద్యోగులందరి మాదిరిగానే ఆయన ఈ వేతనం పొందుతున్నారు. ఇలా దాదాపు ఐదేళ్ల నుంచి వెంకటకృష్ణ రెండు వేతనాలు పొందుతూ వస్తున్నారు. ఈ అదనపు వేతనం చెల్లింపుల వెనుక పలువురి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు రూ.16 లక్షలకు పైగానే స్వాహా చేసినట్లు గుర్తించారు. వెంకటకృష్ణ బ్యాంక్‌ఖాతా స్టేట్‌మెంట్‌ను తెప్పించుకొని పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించి సంబంధిత ఉద్యోగికి మెమో జారీ చేశారు. దీనిపై వెంకటకృష్ణ వివరణ ఇస్తూ...‘అందరిలాగే నేను వేతనం తీసుకున్నాను. ఖమ్మం ఈఈ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు నాఖాతాకు డబ్బులు పంపేవారు. వాటిని ఆయన పేరుమీదే చీటీ కట్టేవాణ్ని. అంతేకానీ నాకేమీ తెలియదు..’ అని చెప్పినట్లు ఎన్నెస్పీ ఈఈ సుమతి తెలిపారు.  ఇప్పటికే నిధులు స్వాహాతో పాటు ఎన్‌ఎంఆర్‌ల నియామకంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తుండటంతో...ఎన్‌ఆర్‌ఎంలకు సంబంధించిన వివిధ రకాల సర్టిఫికెట్లను కూడా అధికారులు మరోసారి పరిశీలిస్తున్న తెలిసింది.
 
 ఎలా వెలుగులోకి వచ్చింది..?
 ఎన్నెస్పీలో జీతాల చెల్లింపులో పలు అవకతవకలు ఇప్పటికే బయటపడ్డాయి. గతంలో కొందరు చనిపోయిన వారి పేరుమీద వేతనాలు డ్రాచేశారు. సుమారు రూ.65 లక్షల వరకు ఇలా స్వాహా అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఫైల్ టు ఫైల్ ఆడిట్ చేస్తుండగా ఈ రూ.16 లక్ష ల స్వాహా వ్యవహారం వెలుగుచూసిందని అధికారులు చెబుతున్నారు. రూ.65 లక్షల నిధుల స్వాహా విషయమై ప్రాథమిక విచారణ అధికారిగా అప్పటి మిర్యాలగూడెం ఎన్నెస్పీ ఎస్‌ఈని నియమించారు.  ఎన్నెస్పీ  సీఈ ఎల్లారెడ్డి ఆదేశాల మేరకు ఆయన 15 రోజుల పాటు విచారణ చేశారు. రూ.65 లక్షల వరకు నిధులు స్వాహా అయినట్లు పేర్కొన్నారు. ఈ అవినీతికి సూత్రధారులుగా ఖమ్మం మానిటరింగ్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ రాజారావులేనని పేర్కొంటూ సీఈకి నివేదిక అందజేశారు. ఆ నివేదికను సీఈ ప్రభుత్వానికి పంపించడంతో సంబంధిత ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిన విషయం తెలిసిందే. రూ.16 లక్షల స్వాహా కూడా వారి హయాంలోనే జరిగినట్లు గుర్తించారు.
 
 నిధుల స్వాహా వాస్తవమే:
 సుమతి, ఎన్నెస్పీ ఈఈ
 చనిపోయిన వారిపేరు మీద బిల్లులు డ్రాచేసిన విషయమై గతంలో విచారణ నిర్వహించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు బాధ్యులపై పోలీసు కేసు పెట్టాం. తాజా ఆడిట్‌లో హుజూర్‌నగర్ వర్క్ ఇన్‌స్పెక్టర్ పేరుతో రూ.16 లక్షలు డ్రా చేసినట్లు బయటపడటంతో మిర్యాలగూడెం ఎస్‌ఈ ఆదేశాల మేరకు మెమో జారీ చేశాం. వర్క్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన వివరణను నివేదికలో పొందుపరిచి ఎస్పీకి పంపించాం. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement