విభజన ఆగితే.. రియల్ వార్ | Sakshi
Sakshi News home page

విభజన ఆగితే.. రియల్ వార్

Published Sat, Oct 19 2013 3:07 AM

విభజన ఆగితే.. రియల్ వార్

తిరుమలగిరి, న్యూస్‌లైన్: ‘‘తెలంగాణ ఏర్పడితే సివిల్ వార్ వస్తదని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు అంటున్నారు.  కానీ, తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగితే రియల్ వార్ వస్తుంది’’ అని టీఆర్‌ఎస్ శాసనసభ ఉపనేత తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. టీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు శుక్రవారం తిరుమలగిరిలో సన్మానసభ ఏర్పాటు చేశారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా హరీష్‌రావు హాజరయ్యారు. సర్పంచులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని, దీనిపై ఎలాంటి కిరికిరి పెట్టినా ఒప్పుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ఎర్రబెల్లి, మోత్కుపల్లిలు చంద్రబాబు పెంపుడు కుక్కలన్నారు. వారు చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదువుతారని విమర్శించారు.  తెలంగాణాలో టీడీపీ జీరో అయిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో సమైకాంధ్ర పల్లకిమోస్తున్న మోత్కుపల్లి నర్సింహులుగొంతు మూగబోయిందన్నారు.

  మో త్కుపల్లి హైదరాబాద్‌లో హీరో, తుంగతుర్తి నియోజకవర్గంలో జీరో అని విమర్శించారు. సీమాంధ్రలో ముఖ్యమంత్రి పదవికోసం కిరణ్‌బాబు, చంద్రబాబు, జగన్‌బాబు పోటీలు పడుతున్నారని ఆరోపించారు. ఎంతమంది బాబులు అడ్డంపడిన తెలంగాణా ప్రక్రియ ఆగదని హెచ్చరించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి సీఎం లాలూప్రసాద్ యాదవ్ ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి లాగానే వ్యవరించాడని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో టీ ఆర్‌ఎస్ ముందంజలో ఉంటుందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు తెలంగాణవాదులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
 సీఎం తెలంగాణ వ్యతిరేకి :
 ఎంపీ వివేక్
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని పెద్దపల్లి ఎంపీ జి. వివేక్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ ప్రాంతానికి పూర్తి అన్యాయం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాకు వేలాదికోట్ల రూపాయలు తీసుకెళ్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందుల సామేలు, డాక్టర్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్యగౌడ్, వేముల వీరేశం, దుంపల క్రిష్ణారెడ్డి, పి. నర్సింహారెడ్డి, సత్యనారాయణ, రవీందర్‌రావు, సురేష్‌నాయక్, అరుణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement