అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు..! | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు..!

Published Fri, May 15 2015 5:46 AM

Operator posts for sale

సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలకు బేరం
50 పోస్టుల భర్తీకి రూ. కోటి వసూలు చేసిన మధ్యవర్తులు
నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న అధికారపార్టీ నేతలు

 
 సాక్షి, కర్నూలు : విద్యుత్తు సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగాలకు అధికారపార్టీ నేతలు బేరం పెట్టారు. లోఓల్జేజీ సమస్య పరిష్కారం, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ఉన్న సబ్‌స్టేషన్లు, ప్రస్తుతం నూతనంగా నిర్మించిన పలు విద్యుత్తు ఉపకేంద్రాలు కొందరు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే షిఫ్టు ఆపరేటర్లు, నైట్‌వాచ్‌మెన్ పోస్టులు కర్నూలు జిల్లాలో రూ. లక్షలు పలుకుతున్నాయి.

నిరుద్యోగ యువత నుంచి బాగా డిమాండ్ ఉండడంతో ఒక్కో పోస్టు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ పోస్టుల భర్తీకి ఆ పార్టీ నేతల సిఫారసులు అధికమయ్యాయి. ఇప్పటికే ఓ 50 పోస్టుల భర్తీ వ్యవహారంలో మధ్యవర్తులు రూ. కోటి వరకు వసూలు చేసినట్లు అంచనా.  

 ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు షిప్టు ఆపరేటర్లు, ఒక నైట్ వాచ్‌మెన్ పనిచేయాల్సి ఉంది. నాలుగు డివిజన్లలోని 199 సబ్-స్టేషన్‌లకు కలిసి మొత్తం 130 ఖాళీ పోస్టులున్నాయి. వీరిని కాంట్రాక్టు పద్ధతిలో డిస్కం అధికారులు నియమిస్తారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న కొందరు అధికారపార్టీ నేతలు ఆ పోస్టులను విక్రయించే సంప్రదాయానికి తెరలేపారు. షిఫ్టు ఆపరేటర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

నైట్‌వాచ్‌మెన్ పోస్టుకు మాత్రం ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. అయితే కాంట్రాక్టు పద్ధతి అయినా ఉద్యోగం పొందితే పర్మినెంట్ చేసే అవకాశం, ఇతరత్రా పోస్టులకు పదోన్నతి పొందే వీలుండడంతో నిరుద్యోగుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. సబ్‌స్టేషన్లలోని పోస్టులు పరిమితంగా ఉండడం, అవకాశం అరుదుగా రావడంతో ఒక్కో పోస్టుకు వందలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీటితోపాటు కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల డివిజన్లలో సుమారు 8 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఈ సబ్‌స్టేషన్లలోనూ షిప్టు ఆపరేటర్లు, నైట్ వాచ్‌మెన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

 నాయకుల చేతివాటం..
 పోస్టులు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పోటీ ఎక్కువైంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలతోపాటు ఆదోని, నంద్యాలలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదనుగా షిఫ్టు ఆపరేటర్, నైట్‌వాచ్‌మెన్ పోస్టులను కొందరు అధికారపార్టీ నాయకులు విక్రయించడం ప్రారంభించారు. నిరుద్యోగుల పోటీని బట్టీ ఒక్కో పోస్టును రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు చెపుతున్నారు.

ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు నిరుద్యోగులు ఇప్పటికే మొదటి విడతగా రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు మధ్యవర్తులకు అప్పగించారు. మరికొందరు తాము ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి అందినంత మేర దండుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్లలో ఏర్పడిన ఖాళీ పోస్టులకు ఇదే విధంగా రూ. లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement