Sakshi News home page

చేతివాటం..!

Published Sat, Mar 1 2014 3:12 AM

Opportunities to utilize the majority of the leaders of the ruling party before the election

సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ముందు అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు  ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం సహకారం అందిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టు పనులు అప్పనంగా అప్పగించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. పారదర్శకత కోసం నిర్దేశించిన ఆన్‌లైన్ టెండర్లకు  మైనర్ ఇరిగేషన్‌శాఖ తిలోదాకాలిస్తోంది. తద్వారా పాలకపక్ష పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది.
 
 రూ.2.63 కోట్లు విలువ చేసే  పనులను గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టేందుకు యంత్రాంగం సన్నద్ధమెంది. ఉదయం నోటీసు బోర్డులో టెండర్ల నోటీసు పొందుపర్చి, సాయంత్రమే షెడ్యూల్‌కు తుది గడువును విధించి స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు పోటీదారులు లేకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
 మైనర్ ఇరిగేషన్ శాఖలో ఇటీవల టెండర్ల జాతర చోటుచేసుకుంది. రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో చెరువులు,  పికప్ ఆనకట్టలు నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ  శ్రీకారం చుట్టింది. తాజాగా రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలో రూ.2.63కోట్ల తో 36 పనులను చేపట్టేందుకు నిర్ణయించింది. ఆపనులన్నీ అధికార పార్టీ నేతలకు మాత్రమే దక్కేటట్లు చర్యలు చేపడుతూ తదనుగుణంగా సఫలీకృతులవుతున్నారు. తాజా ఉత్తర్వులను కాదని, కాలం చెల్లిన ఉత్తర్వుల ఆధారంగా టెండర్లు చేపడుతున్నారు. రూ. లక్ష పైబడి చేపట్టే పనులకు ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.  ఇతర జిల్లాల్లో ఈ విధంగానే నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయ్యే అవకాశం ఉండదు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం కోరుకున్న వారికి కోరుకున్న పనులు అప్పగించడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement