‘నోటీసులిచ్చినా రుణాలు చెల్లించొద్దు’ | Sakshi
Sakshi News home page

‘నోటీసులిచ్చినా రుణాలు చెల్లించొద్దు’

Published Sun, Oct 5 2014 7:16 PM

‘నోటీసులిచ్చినా రుణాలు చెల్లించొద్దు’ - Sakshi

పుట్టపర్తి: వ్యవసాయ, డ్వాక్రా రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చినా ఎవ్వరూ చెల్లించవద్దని రైతులు, మహిళలకు రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు, డ్వాక్రా రుణాలను ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుందని చెప్పారు.

రైతులు, మహిళలు ఒక్కపైసా కూడా చెల్లించవద్దన్నారు. వ్యవసాయ సాధికార పరిషత్ ద్వారా రైతు రుణాలు చెల్లించి తిరిగి అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా 20 శాతం రుణాలు చెల్లించడమేగాక 20 శాతం కొత్త అప్పులు ఇచ్చేలా బ్యాంకు అధికారులతో చర్చించామన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ వల్ల రూ.8,800 కోట్లు ప్రభుత్వానికి అదనపు బరువు పడుతుందని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా పారిశుధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఐదెకరాల నిబంధనతో ఎవరికైనా పింఛన్ కట్‌చేసి ఉంటే  తిరిగి అందేలా చూస్తామన్నారు. సర్కార్ జిల్లాల ప్రాంతంలో అర ఎకరా భూమి రాయలసీమలో 15 ఎకరాలకు సమానమని చెప్పారు. గ్రామ కమిటీల్లో కక్షసాధింపుతో అర్హుల పింఛన్లు తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు ఇదివరకు చెల్లించిన డిపాజిట్లన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయాయని, వాటిని తిరిగి రాష్ట్రానికి తెప్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement