పెన్నాను గోదావరితో అనుసంధానిస్తాం | Sakshi
Sakshi News home page

పెన్నాను గోదావరితో అనుసంధానిస్తాం

Published Wed, Jul 20 2016 2:23 AM

పెన్నాను గోదావరితో అనుసంధానిస్తాం - Sakshi

- నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదు: చంద్రబాబు
కృష్ణా-గోదావరి సంగమం వద్ద సీఎం ప్రత్యేక పూజలు  

 సాక్షి, విజయవాడ : దేశంలో రెండు జీవనదులను అనుసంధానించిన ఘనత తమదేనని, రాబోయే రోజుల్లో పెన్నా నదిని గోదావరితో అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఫెర్రి వద్ద కృష్ణా-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో మంగళవారం ఆయన పసుపు, కుంకుమ, పట్టుచీరలను వదిలి కృష్ణవేణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ సంగమం వద్ద జలాన్ని తలపై చల్లుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగితే నీటి కొరత ఉండదన్నారు. గోదావరి నీరు కృష్ణమ్మ చెంతకు రావడం ఒక చరిత్రగా అభివర్ణించారు.

రికార్డు స్థాయిలో 365 రోజుల్లో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని భావించి పట్టిసీమను ప్రారంభించామన్నారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు సరఫరా చేసి, శ్రీశైలం నీటిని రాయలసీమకు ఇస్తామని వెల్లడించారు. అయితే కృష్ణా-గోదావరి సంగమం వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు కాళ్లకు బూట్ల ధరించి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బూట్లు ధరించి పవిత్ర  కృష్ణానదికి పసుపు, కుంకుమ, పట్టుచీర సమర్పించడమే కాకుండా హారతులు కూడా ఇచ్చారు. ఇది హిందూ సంప్రదాయలకు విరుద్ధమని పలువురు పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కృష్ణా, గోదావరి నదుల సంగమం వద్ద చంద్రబాబు మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తరువాత హారతులు ఇవ్వడాన్ని పండితులు తప్పుపడుతున్నారు. చంద్రబాబు హారతులు ఇచ్చే సమయంలో దుర్ముహూర్తం ఉందంటున్నారు. ఇలాంటి విషయాలను రాష్ట్రాధినేత చంద్రబాబు పట్టించుకోకపోవడం రాష్ట్రానికి అరిష్టంగా మారుతుందంటున్నారు.

 హనోవర్ ఫెయిర్‌లా అమరావతి కన్వెన్షన్ సెంటర్
 సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా పేరెన్నికగన్న జర్మనీలోని హనోవర్ ఫెయిర్ తరహాలో అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు చైర్మన్ డాక్టర్ షెట్టీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. అబుదాబీకి చెందిన ఈ గ్రూపు మే 22న ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్రానికి వచ్చింది.

Advertisement
Advertisement