'తెలంగాణ ఘనత ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు' | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఘనత ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు'

Published Sun, Feb 23 2014 12:29 PM

ఎం. వెంకయ్యనాయుడు - Sakshi

ముందు చూపు లేకుండా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేసిందని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు ఉభయ సభలలో పాస్ కాకుంటే తప్పు  మాపై నెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు. బిల్లుకు మద్దతు ఇవ్వడంతో తమ పార్టీకి ప్రజలలో విశ్వసనీయత పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు.

 

విభజన అనంతరం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు. ఇరుప్రాంతాలను అభివృద్ధి చేయగల సత్తా ఏ పార్టీకి ఉందో గ్రహించాలని ప్రజలకు సూచించారు. దేశం ఎవరి వల్ల బాగుపడుతుందో గమనించాలని ఆయన ప్రజలకు హితవు పలికారు. హైదరాబాద్లో సీమాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసిన ఘనత ఎవరికి దక్కాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.

 

విభజన ప్రక్రియ మాత్రం అప్రజాస్వామికంగా జరిగిందన్నారు. మా వల్లే విభజన జరిగిందని కాంగ్రెస్ నాయకులు  సీమాంధ్రలో చెబుతున్నారని, అదే మాట తెలంగాణలో కూడా చెప్పాలని ఆయన ఆ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలపై మాట్లాడటంలో తప్పు లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వెంకయ్యనాయుడు తెలిపారు. మోడీ ప్రధాని కావడానికి ఇరు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్కు అధికారాలంటే ఎంఐఎం భయపడుతోందని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement