నిరాశ పరిచిన బడ్జెట్ | Sakshi
Sakshi News home page

నిరాశ పరిచిన బడ్జెట్

Published Thu, Aug 21 2014 1:51 AM

నిరాశ పరిచిన బడ్జెట్ - Sakshi

 టీడీపీ ప్రభుత్వం జిల్లాకు మొండిచేయి చూపింది. ఏవేవో ఆశలు కల్పించి చివరకు నిరాశ మిగిల్చింది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఒక విధంగా జిల్లాను పూర్తిగా విస్మరించారని వివిధ రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. చివరకు నీటి పారుదల ప్రాజెక్టులకూ నిధులు కేటాయించలేదు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : నవ్వాంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్‌లో జిల్లాకు అన్యాయం చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం జిల్లాను పూర్తిగా విస్మరించింది. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన పక్కన పెడితే ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించలేదు. అత్తెసరు కేటాయింపులతో చేతులు దులుపుకొంది. గిరిజన యూనివర్సిటీ ప్రస్తావనే లేదు. ఆశలురెకెత్తించిన కొత్త ఎయిర్ పోర్ట్ అంశాన్నే చేర్చలేదు.
 
 ఊరిస్తున్న వైద్య కళాశాల ఊసే లేదు. వెనుక బడిన జిల్లాగా ఆదుకునే ప్రత్యేక ప్యాకేజీ సాయమేది కేటాయించలేదు. ఇదంతా చూస్తుంటే అంతన్నాడు...ఇంతన్నాడు..అన్న చందంగా బడ్జెట్ మిగిలిపోయింది. చారిత్రాత్మక, అన్నీ వర్గాల ఆకట్టుకునే బడ్జెట్ అంటూ గొప్పలు పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు జిల్లాకు సాధించిందేంటో  చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనతో జిల్లాకు ఏదో ఒరుగుతుందనుకుంటే బడ్జెట్‌లో ప్రత్యేకతేమీ లేకపోవడంతో ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కొత్తగా ఏ ఒక్కటీ మంజూరు చేసిన దాఖలాలు బడ్జెట్‌లో కనిపించలేదు. పొరుగు జిల్లాలకు ఒకటి రెండు ప్రాజెక్టులను కేటాయించినా విజయనగరం జిల్లాకొచ్చేసరికి పూర్తిగా వివక్ష చూపింది.
 
 అంకెల బడ్జెట్
 రాష్ట్ర విభజన అనంతరం తొలి సారిగా టీడీపీ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గారెడీని తలపిస్తోంది. వాస్తవ బడ్జెట్‌కు ఆమడదూరంలో ఉంది. ఆర్థిక మంత్రి యనమల తన అనుభవాన్ని ఉపయోగించి బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ వల్ల ప్రజలకు నేరుగా లబ్ధిచేకూరే పరిస్థితి లేదు. ప్రధానంగా హౌసింగ్‌కు కేటాయించిన నిధులు పాత బిల్లులు మంజూరుకే సరిపోతుంది. ఇలా అయితే ఈ ఏడాదిలో నిరుపేదలకు కొత్త ఇళ్ల మం జూరు లేనట్లే. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ప్రకటించిన హమీలకు ప్రస్తుత బడ్జెట్‌కు పొంతన లేదు.  ఈ బడ్జెట్ ప్రజామోదయోగ్యమైనది కాదు.    
         - కోలగట్ల వీరభద్రస్వామి,
 వైఎస్‌ఆర్‌సీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి
 
 జిల్లాకు ద్రోహం చేశారు
 బడ్జెట్‌లో జిల్లాకు దారుణంగా ద్రోహం చేశారు. ఇరిగేషన్‌తో పాటు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన లేకపోవడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమే. బడ్జెట్‌లో ప్రస్తావించిన అంకెలు అబద్ధం. అవి ఆచరణకు సాధ్యం కాదు.
 - ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
 ప్రజలను విస్మరించారు
 ప్రజాసంక్షేమం అనేపదాన్ని బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారు. అపార అనుభవం ఉందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తమ అనుభవాన్ని ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించారు. ఆచరణకు సాధ్యంకాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మిగలు బడ్జెట్ ఎంత, లోటు బడ్జెట్ ఎంత అన్నది ప్రస్తావించలేదు. వ్యవసాయ రంగానికి రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అది ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్పలేదు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీపై ప్రస్తావనలేకపోవడం అత్యంత దారుణం. విద్య, వైద్యం, సంక్షేమరంగాలపై చిన్నచూపు చూశారు.
         - పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
 

Advertisement
Advertisement