సీఎం జగన్‌ మాట.. జనం బాట | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ మాట.. జనం బాట

Published Mon, Apr 13 2020 11:31 AM

People Supporting CM Jagan Decision To Lift Lockdown In Green Zone - Sakshi

సాక్షి, కడప : కరోనా పాజిటివ్‌ కేసులు లేని గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తే మంచిదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలకు జిల్లా వాసులు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. రైతులు, అన్ని రకాల వ్యాపారులు, వలస కార్మికులు, దినసరి కూలీలు సీఎం సూచనను సమరి్ధస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి పంట ఎగుమతులకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతుండగా, పూర్తిస్థాయి లాక్‌డౌన్‌తో వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయి తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కరోనా పాజిటివ్‌ ఆంక్షలున్న ప్రాంతాలు మినహా గ్రీన్‌ జోన్‌లో ఆంక్షలు సడలించాలన్న సీఎం సూచనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.  

ఇప్పటికే లాక్‌డౌన్‌ మొదలై 22 రోజులు దాటుతోంది. పండించిన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో 2.27 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేయగా, 15 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పెద్ద ఎత్తున శనగ కొనుగోలు చేసింది. అందుకు సంబంధించి నగదును రైతు ఖాతాల్లో ఇప్పటికే జమ చేసింది. మిగిలిన శనగలు రైతుల వద్దే ఉండిపోయాయి. వాటిని దాచుకునేందుకు జిల్లాలో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో లేవు. ఇప్పటివరకు జిల్లాలోని 35 ప్రైవేటు, 9 మార్కెట్‌ యార్డు పరిధిలోని గోడౌన్లలో ఖాళీ లేకపోవడంతో పండించిన సరుకును తమ ఇళ్లలోనే దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది వారికి ఇబ్బందిగా మారింది. మరోవైపు బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 35 వేల ఎకరాల్లో ఎగుమతి రకం మిర్చి పంటను సాగు చేశారు. ఎకరాకు సగటున 25–30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎండుమిర్చిని గుంటూరు మార్కెట్‌యార్డులో అమ్ముకోవాల్సి ఉండగా, కరోనా లాక్‌డౌన్‌తో ఎగుమతులు ఆగిపోయాయి. మార్కెట్‌ యార్డు మూతపడింది.

ఇప్పటికీ 4 లక్షల క్వింటాళ్ల మిర్చి రైతుల వద్దే ఉండిపోయింది. కడపజిల్లాతోపాటు సమీపంలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కోల్డ్‌ స్టోరేజీలు ఖాళీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పులివెందుల, రాజంపేట, మైదుకూరు ప్రాంతాల్లో 10 వేల హెక్టార్లలో రైతులు అరటి పంటను సాగు చేశారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చొరవతో చాలావరకు అరటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలతో పూర్తి స్థాయిలో తరలించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో వేల హెక్టార్లలో మామిడి సాగై ఉంది. మామిడి కాయలను ముంబయి, బెంగళూరు, దుబాయ్, తదితర ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది.

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎగుమతులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌తో అన్ని పనులు ఆగిపోవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కారి్మకులకు పనులు లేకుండా పోయాయి. దీంతో వారు అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని స్థానికంగా ఉన్న దినసరి కూలీలకు వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం కల్పించడంతో కొంతలో కొంత వారి ఇబ్బందులు తీరుతున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది తోపుడుబండ్లు, టీ కొట్లు, ఫ్రూట్స్‌ అంగళ్లు, చిన్నచిన్న హోటళ్లు తదితర చిరు వ్యాపారాలు మొదలుకొని పెద్ద పెద్ద దుకాణాలు, మాల్స్‌ మొత్తం లాక్‌డౌన్‌ ఆంక్షలతో మూతపడ్డాయి. వ్యాపారులు రూ.కోట్లలో నష్టపోతున్నారు. చిరు వ్యాపారులు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. 

ప్రజలకష్టాలు అర్థం చేసుకుని... 
 పరిస్థితిని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది వ్యవసాయ కుటుంబాలు, దినసరి కూలీలు, వలస కార్మికులు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రీ మోదీకి వివరించారు. కరోనా పాజిటివ్‌ కేసులున్న కంటైన్మెంట్, బఫర్‌ జోన్‌ ఏరియాలను మినహాయించి గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో ఆంక్షలతో లాక్‌డౌన్‌ సడలించాలని ప్రధానికి సూచించారు. ఇదే జరిగితే రైతుల ఇబ్బందులు తీరడంతోపాటు కొంతమేర అయినా వ్యాపారస్తులకు ఉపశమనం లభిస్తుంది. సీఎం చెప్పినట్లు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

కూలీల అవస్థలు అన్నీ ఇన్నీ కావు 
నా పేరు రియాజ్‌. దినసరి కూలీని. రాజంపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. మా ప్రాంతాన్ని  లాక్‌డౌన్‌నుంచి మినహాయిస్తే ప్రయోజనం  ఉంటుంది.  పనులు చేసుకుని కుటుంబాన్ని  పోషించుకుంటాం. ప్రభుత్వం, అధికారులు ఆలోచించి దయ చూపితే కూలీలు బాగుపడతారు. 

ఆంక్షలు సడలించాలి 
నాకు పది ఎకరాల పొలం ఉంది.  అరటి పంటను సాగు చేశాను. ఉద్యాన పంట దిగుబడులు అమ్ముకోవడం చాలా కష్టంగా ఉంది. కరోనా కట్టడి చేయాల్సిందే కాదనలేదు.ఇదే సమయంలో దేశంలోని మార్కెట్‌లకు ఆంక్షలు సడలించాలి. పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రైతులు బయట పడతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచన మంచిదే. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. ఈ పరిస్థితుల్లో రూపాయి చేతికందే పరిస్థితులు కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు సడలించి ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్‌కు అరటి తరలిపోయేలా చూడాలి.     –కె.చంద్రమోహన్‌రెడ్డి, అరటి రైతు, లింగాల, లింగాల మండలం. 

లాక్‌డౌన్‌ ఎత్తేసి పీఎం, సీఎం పుణ్యం కట్టుకోవాలి 
నా పేరు శ్రీనివాసులు. బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. దాదాపు నెల రోజులుగా కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దీంతో పనులు లేకుండా పోయాయి.  పూటగడవడం చాలా కష్టంగా మారింది. ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచించి రాజంపేట ప్రాంతంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసి పుణ్యం కట్టుకోవాలి.  

Advertisement
Advertisement