నియంతను మించి ‘బాబు’ పాలన | Sakshi
Sakshi News home page

నియంతను మించి ‘బాబు’ పాలన

Published Sat, Aug 9 2014 2:41 AM

నియంతను మించి ‘బాబు’ పాలన - Sakshi

 మంగళగిరి : తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా అనుభవం గడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన తీరు నియంత పాలనను సైతం మించిపోతుందని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ కార్యకర్తలకు కలెక్టర్‌లు, ఎస్పీలు పనులు చేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటారా అనేవిధంగా ప్రజాస్వామ్యవాదులే ఆశ్చర్యపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
 
 జిల్లాలోని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీచేయడం వలనే నెల్లూరు, ప్రకాశం జెడ్పీ, ముప్పాళ్ళ మండల పరిషత్ ఎన్నికల్లో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారనేది తేటతెల్లమవుతోందన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి పరిపాలన కొనసాగించి ప్రజల మన్ననలు పొందాలని అధికారులకు చెప్పాల్సిన ముఖ్యమంత్రి తమ నాయకులు చెప్పిన వారికి పనులు చేయండని చెప్పడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతవరకు సమంజసమని ఆర్కే ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టి రెండునెలలు ముగిసినా ఇప్పటివరకు తాను తొలిగా చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటి కూడా ఆచరణలోకి రాకపోవడం ఆయన సంత కాలకు వున్న విలువను ఆపహాస్యం చేసే విధంగా వుందన్నారు.
 
 అధికార పార్టీ నేతల అండతోనే ఇసుక, మైనింగ్, భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతన్నాయనేది బహిరంగ రహస్యమేనేని, వాటిని నిలువరించేందుకు అధికారులకు స్వేచ్ఛ కల్పించాలన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, ప్రశ్నించిన వారిపై పోలీసులను ఉసిగొల్పడం వంటి చర్యలను చంద్రబాబు మానుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి రాష్ట్రప్రజలు ఎదురుతిరిగి నిలదీయకముందే తాను చేసిన వాగ్దానాలను అమలుపర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆర్కే స్పష్టం చేశారు.

Advertisement
Advertisement