బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మాండం | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మాండం

Published Sun, Oct 5 2014 4:33 AM

బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మాండం - Sakshi

 - కోలాహలంగా వాహన సేవలు, గరుడసేవలో వీఐపీ దర్శనంపై విమర్శల వెల్లువ
- 31 లక్షల మందికి అన్నప్రసాదాలు  
- ఆకట్టుకున్న  విద్యుత్ అలంకరణలు
- అన్నీ తానై నడిపించిన ఈవో గిరిధర్ గోపాల్
- జేఈవో నిరంతర పర్యవేక్షణ  
- డీఐజీ, సీవీఎస్‌వో, ఎస్‌పీ పటిష్ట భద్రత

సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉదయం చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అంతకుముందు రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం, రా త్రి అశ్వవాహన సేవలు అంగరంగవైభవంగా సాగాయి. దేవదేవుడు పూటకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరిస్తూ పరవశింప చేశారు. ఈసారి హుండీ కానుకలూ పెరిగాయి. గరుడవాహనంలో మూడు లక్షల మందికిపైగా పాల్గొనడం విశేషం. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ఈసారి అన్నీ తానై వాహనసేవల్ని నడిపించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను  నిరంతరం పర్యవేక్షించారు.  
 
వాహన సేవలు.. విమర్శలు
గత నెల 26వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు ఈనెల 4వ తేదీ శనివారం వరకు  తొమ్మిది రోజులపాటు అత్యంత వేడుకగా సాగాయి. తొలి రోజు పెద్ద శేషవాహనం తో ప్రారంభమై ఆఖరిరోజు తిరిచ్చివాహనంతో ముగిశాయి. ఆలయ విభాగం సమష్టిగా పనిచేసి సకాలంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తులను వాహన మండపానికి తరలించి అక్కడ విశేష ఆభ రణాలు, పుష్పాలంకరణ చేశారు. నిర్ణీత సమయానికి ఉత్సవాలను నాలుగు మాడవీధుల్లో ప్రదర్శన నిర్వహిం చారు. కీలకమైన గరుడ వాహన సేవలో ఈసారి ఆలయంలోని మూలమూర్తి తరహాలో సుమారు 50 నిమిషాలపాటు వెయ్యిమందికి దర్శనం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ తర్వాత వెలుపలకు వచ్చిన గరుడ వాహనాన్ని తూర్పు మాడ వీధిలో సుమారు లక్ష మందికి భక్తులకు కేవలం పది హేను నిమిషాల్లోనే దూరంగా నుంచి చూపించి మమ అనిపించడం ఇంటాబయటా విమర్శలు మూటకట్టుకున్నారు. ఆరోజు  సుమారు 3 లక్షల మంది ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. ఆరో రోజు స్వర్ణరథం ఊరేగింపు  కన్నుల పండువగా సాగింది. ఎనిమిదో రోజు ఉదయం మహారథం  భక్తుల గోవింద నామస్మరణల మధ్య వైభవంగా సాగింది. తూర్పు,దక్షిణమాడ వీధిలోని మలుపును వెడల్పు చేయడం వల్ల  మహారథం ఊరేగింపు కార్యక్రమం వేగవంతమైంది. వాహన సేవల ముందు హిందూ ధర్మప్రచార పరిషత్తు, దాస సాహిత్య, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యం లో మూడువేల మందికిపైగా కళాకారులు తమ కళాభినయంతో భక్తులను అలంరిం చారు.
 
31 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం
- టీటీడీ నిత్యాన్న ప్రసాద ట్రస్టు నుంచి రికార్డు స్థాయిలో 31 లక్షల 44వేల 167 మంది భక్తులకు అన్ని రకాల అన్నప్రసాదాలు అందించారు. ఇందులో 12.13 లక్షల మందికి  భోజనం, 8.32 లక్షల మందికి టిఫిన్లు, 10.98 లక్షల మందికి పాలు, కాఫీ, టీ, మజ్జిగ అందజేశారు.
- ఐదోరోజు గరుడ  వాహన సేవను 3 లక్షల మంది దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవం, మహారథోత్సవంలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
- ఈసారి ఎనిమిది రోజుల్లో 21 లక్షల 27వేల 379 లడ్డూలను భక్తులకు సరఫరా చేయగా, దాని ద్వారా రూ.3 కోట్ల్ల 11 లక్షల 84 వేలు లభించింది. గతంలో కంటే ఈసారి 9.3 శాతం పెరగడం విశేషం. అలాగే, దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.3 లక్షల 70 వేలు లభించింది.
- గదుల అద్దె ద్వారా రూ.1కోటి 45 లక్షల 82 వేలు లభించగా, గత ఏడాది రూ.94 లక్షల 11వేల 210 అందింది. ఈసారి    49,624 మందికి ఉచిత వైద్యసేవలు అందించారు.
- ఎనిమిది రోజుల్లో 246 లక్షల గ్యాలన్ల నీటి వాడకం
-  ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా 10 మొత్తం లక్షలా 30 వేల మందికి  ప్రయాణ సౌకర్యం కల్పించారు.
- పుస్తక విక్రయాల ద్వారా రూ.2,89,131 ఆదాయం
- రోజుకు 3957 మంది శ్రీవారి సేవకుల సేవలు

 విజిలెన్స్, పోలీసుల పటిష్ట భద్రత
 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనంతపురం రేంజ్ డీఐజీ బాల కృష్ణ, సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్‌పీ గోపీనాథ్‌జ ట్టి, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుమల  ఏఎస్‌పి ఎంవీఎస్ స్వామి, డీఎస్‌పి నరసింహారెడ్డి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1500 మంది నియమించారు.  టీటీడీ విజిలెన్స్ విభాగం మరో  2500 మందిని భద్రత కోసం వినియోగించారు.

 ఉత్సవాల్లో  ప్రముఖుల సందడి
 బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు  జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్  అరుణ్ మిశ్రా తదితరులు వాహన సేవల్లో  పాల్గొన్నారు.

 స్వర్ణరథం, మహారథంపై ఇంజనీర్ల ప్రత్యేక శ్రద్ధ
 ఈ బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథం, మహారథం ఊరేగింపును ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, ఇంజనీర్లు మూరె రమేష్‌రెడ్డి, జీవీ కృష్ణారెడ్డి,రాజశేఖర్, దేవరాజుల  బృందం నిరంతర పర్యవేక్షణతో రెండు రథాలను  ఊరేగించడంలో సఫలీకృతులయ్యారు. పుష్కరిణిలో నీటి ని తొలగించటం, మరమ్మతులు చేయడం, చక్రస్నానం కోసం పుష్కరిణిని పూర్తిస్థాయి క్లోరినేషన్‌తో సిద్దం చేయటం వరకు ఈఈ నరసింహమూర్తి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సాక్షాత్తు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు పుష్కరిణిలోని నీటి క్లోరినేషన్, పరిశుభ్రత చాలా బాగుందని కితాబిచ్చారు.

ఆకట్టుకున్న పుష్ప, ఫొటో ప్రదర్శనలు.. విద్యుత్ అలంకరణలు భేష్
ఈసారి టీటీడీ ఉద్యానవనం, విద్యుత్ విభాగాలు పోటీపడి అలంకరణలు చేశాయి. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నేతృత్వంలో 30 టన్నుల పుష్పాలతో  ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ పరిమళభరిత పుష్పాలతో అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యుత్ విభాగం ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, డీఈ రవిశంకర్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు. ఈసారి 30 భారీ విద్యుత్ కటౌట్లతోపాటు ఎల్‌ఈడీ అలంకరణలు భక్తులను ఆనంద పరిచాయి. అలాగే పుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఎస్వీ మ్యూజియం డెరైక్టర్ విజయ్‌కుమార్, చిత్రకారుడు బత్తల ఆనంద్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలు, ఇతర పురాతన వస్తువుల ప్రదర్శనకు విశేష స్పందన కనిపించింది.  గతంలో పోల్చితే ఈసారి ప్రదర్శనలు తిలకించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Advertisement
Advertisement