తిరుమలలో భక్తుల ఆందోళన | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల ఆందోళన

Published Thu, Dec 31 2015 9:58 PM

pilgrims protest in tirumala

తిరుమల : శ్రీవారి దర్శనానికి అనుమతించలేదని టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చిన భక్తులు గురువారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులు టీటీడీ వెబ్‌సైట్, ఈ-మెయిల్ ద్వారా భక్తులకు చేరవేశారు. ఆ సమాచారం అందుకోలేని సుమారు 50 మందికిపైగా భక్తులు గురువారం శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు.

వీరిని అక్కడి సిబ్బంది అనుమతించలేదు. ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని విరాళాలు ఇచ్చిన దాతలకు బదులిచ్చారు. తాము రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు టీటీడీకి విరాళాలిచ్చామని, ముందస్తు సమాచారం లేకుండా దర్శనానికి అనుమతించకపోవడం సబబుకాదని ఆందోళనకు దిగారు. చేతిలో విరాళాల పాస్‌పుస్తకాలు పట్టుకుని నినాదాలు చేశారు. దీనిపై అక్కడ కొంత సమయం గందరగోళం ఏర్పడింది. ఈ సమాచారంతో టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆ భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు.
 

Advertisement
Advertisement