గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు

Published Thu, Nov 6 2014 2:59 AM

Plans the development of villages

స్కిన్నెరపురం (అత్తిలి) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మండలంలో స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల్లో బుధవారం జన్మభూమి-మా ఊరు సభ జరిగింది. స్కిన్నెరపురంలో జరిగిన సభకు మంత్రి సుజాత, దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో రెండు, మూడు రోజుల్లో ఇసుక సమస్య తీరుతుందన్నారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో సమస్యలు నెలకొన్నాయని, భవిష్యత్ అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు జన్మభూమి కార్యక్రమం వేదికగా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని, ఐఎస్‌ఎల్ నిర్మాణానికి రూ.12 వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలను భాగస్వాములు చేసి, పేదరికాన్ని జయించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సందర్భంగా పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. గర్భిణులకు సీమంతం చేసి, సారెను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దిరిశాల భీమరాజు, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, సర్పంచ్‌లు వనుం రామ కనకదుర్గ, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement