Sakshi News home page

బూటు కాళ్లతో తన్నులు.. పిడిగుద్దులు..

Published Fri, Jul 21 2017 1:46 AM

బూటు కాళ్లతో తన్నులు.. పిడిగుద్దులు..

సాక్షి ప్రతినిధి, ఏలూరు : గురువారం తెల్లవారుజాము 5 గంటలు కావస్తోంది.. వందలాది మంది పోలీసులు బిలబిలమంటూ వాహనాల్లోంచి దిగారు.. కొందరి ఇళ్ల తలుపులు తట్టి లాక్కెళ్లారు.. ఆ తర్వాత రోడ్డుపైకొచ్చిన వారిని వచ్చినట్లు వాహనాల్లోకెక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.. ఇదేంటని ప్రశ్నించిన వారిపై పిడిగుద్దులు కురిపించారు.. మహిళలని కూడా చూడకుండా బూటుకాళ్లతో తంతూ ఈడ్చి పడేశారు.. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో చోటుచేసుకుంది.

గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు ఫ్యాక్టరీ నిర్మాణ సామగ్రి తరలింపును ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించొద్దంటూ మూడేళ్లుగా తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగరువు.. పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్యం గురువారం యంత్ర సామగ్రిని తరలించాలనుకుంది.

 గ్రామస్తుల నుంచి ఇక్కట్లు రాకుండా ప్రభుత్వం గురువారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది పోలీసులను అక్కడికి తరలించింది. మెగా ఆక్వాఫుడ్‌ పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నేతలు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వరరావు తదితరులను అరెస్ట్‌ చేసి మొగల్తూరు స్టేషన్‌కు తరలించారు. ఇది అన్యాయమంటూ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళలను ఈడ్చుకుంటూ వ్యాన్లలో ఎత్తిపడేసి.. బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

తప్పక చదవండి

Advertisement