Sakshi News home page

పంపులో కంపు

Published Thu, Mar 17 2016 12:52 AM

Polluted water supplies

కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా
పట్టించుకోని నగరపాలకులు
గగ్గోలు పెడుతున్న ప్రజానీకం
జోరందుకున్న మినరల్ వాటర్ వ్యాపారం

 
రాజధాని నగరంలో ప్రజారోగ్యానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. శుద్ధమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావాల్సిన పంపుల్లో కంపు నీరు వస్తోంది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో  ఏ కుళాయి తిప్పినా మురికినీరే వస్తోందని జనం గగ్గోలు పెడుతున్నారు. నీటి పన్నును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు నాణ్యమైన నీరివ్వడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా మినరల్ వాటర్ విక్రేతలు జేబులు నింపుకొంటున్నారు.
 
విజయవాడ సెంట్రల్ : ఇటీవలి కాలంలో విజయవాడ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా మంచినీటి సమస్యే కనిపిస్తోంది. గతంలో సర్కిల్-3కి మాత్రమే పరిమితమైన సమస్య ఇప్పుడు 1, 2 సర్కిళ్లకు పాకింది. బాడవపేట, నెహ్రూనగర్, క్రీస్తురాజపురం, గుణదల, అంబేద్కర్‌నగర్, సున్నపుబట్టీల సెంటర్, పటమట, ఎల్‌ఐసీ కాలనీ,  సింగ్‌నగర్, పాయకాపురం, వైఎస్సార్ కాలనీ, భవానీపురం ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందని 103కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం సమస్య అంత తీవ్రంగా లేదని కొట్టిపారేస్తున్నారు. నీటి సరఫరా కోసం ఏడాదికి రూ.32.40 కోట్లను  నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన నీరు ప్రజలకు అందడం లేదు.  రామలింగేశ్వరనగర్‌లో     రూ. 25 కోట్లతో నిర్మించిన 10 ఎంజీడీ ప్లాంట్ అధ్వానంగా మారింది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే మంచి నీటిలో మురుగునీరు మిళితం కావడంతో ఆ ప్లాంట్ పరిధిలోని నాలుగు లక్షల మంది ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రక్షి త నీటి సరఫరా పథకాల కోసం రూ.110 కోట్లు కేటాయించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

 తోడేస్తున్నారు..
 ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం 164 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీరు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ లేని విధంగా నీటిని సరఫరా చేస్తున్నామన్నది అధికారుల వాదన.  నగర ప్రజల అవసరాల్లో 60 శాతం నీటిని కృష్ణానది నుంచి, 40 శాతం బోర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. కృష్ణానదిలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగుల నుంచి 7.1 అడుగులకు తగ్గింది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద మోటార్ల ద్వారా నీటిని తోడేయడంతో లీకేజీలు ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు కలుస్తోంది. రా వాటర్ ట్రీట్‌మెంట్ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి.
 
పూర్తికాని ఇంటర్ కనెక్షన్లు
రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, బ్రిడ్జిల ఏర్పాటు నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా సర్కిల్-1 పరిధిలో పైప్‌లైన్ మార్చేందుకు రూ.18 కోట్లతో పనులు చేపట్టారు. మూడు నెలలుగా పనులు సాగుతున్నాయి. ఇంటర్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తికాలే దు. వన్‌టౌన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసినప్పుడు కొద్ది రోజుల పాటు ఈ సమస్య ఉంటుందని అధికారులు సమర్ధించుకుంటున్నారు.
 
పట్టించుకోవడం లేదు
హెడ్ వాటర్ వర్క్స్‌లోని 5, 8, 11, 16 ఎంజీడీ ప్లాంట్ల ద్వారా రోజుకు 40 ఎంజీడీ సామర్థ్యానికి గాను 36 ఎంజీడీ నీటిని సరఫరా చేస్తున్నారు. గంగిరెద్దుల దిబ్బ వద్ద 10 ఎంజీడీ ప్లాంట్ ద్వారా రోజుకు 2.50 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు 62 రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కుళాయిల ద్వారా తరచు మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. మినరల్ వాటర్‌కు రోజుకు కనిష్టంగా రూ.10 చొప్పున ఖర్చుచేయాల్సి వస్తోందంటున్నారు. తాగునీరు కలుషితమవుతోందని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో సైతం పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు తాగునీటి కొరత, కలుషితం సమస్యలపై గళమెత్తారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు లేదు.
 
 తాగలేం బాబోయ్
మా ప్రాంతంలో కుళాయిల  నుంచి వచ్చే నీటిని చూస్తుంటే భయమేస్తోంది.  కనీసం కాచుకుని తాగేందుకు కూడా పనికిరాకుండా ఉన్నాయి. ఎంతసేపు ఎదురుచూసినా నీళ్లు మురికిగానే వస్తుండడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఈ నీటిని తాగితే రోగాలబారిన పడడం ఖాయం.  నగరపాలక సంస్థ అధికారులు ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలి.
 - మోపిదేవి కోకిల,  చుట్టుగుంట    
 
చర్యలు చేపడతాం
నగరంలో కలుషిత నీటి సమస్య అంత పెద్దగా ఏమీ లేదు. స్పష్టమైన ఫిర్యాదులు ఉంటే చర్యలు చేపడతాం. సర్కిల్-1 పరిధిలో పైప్‌లైన్ పనులు పూర్తికావొచ్చాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళిక రూపొందించాం. పలు ప్రాంతాల్లో కొత్తగా 9 బోర్లు వేస్తున్నాం. కార్పొరేటర్ల సూచన మేరకు మరో 20 బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం.
 - ఎం.ఎ.షుకూర్, ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ
 
స్నానం చేయాలంటే భయమేస్తోంది..
నాలుగు రోజులుగా కుళాయిల నుంచి మురుగునీరు వస్తోంది. ఈ నీటితో స్నానం చేయాలంటే భయంగా ఉంది. తాగునీటి కోసం వాటర్ క్యాన్‌లు కొనుగోలు చేసి వాడుతున్నాం. ఇటీవల మా పక్కింటి కుళాయిలో  నీటితో పాటు పురుగులు  కూడా వచ్చాయి.  -కాకర్ల పద్మ, మధురానగర్
 
పన్ను వసూళ్లలో ఫస్ట్..
ముక్కుపిండి మరీ పన్నులు వసూలుచేయడంలో ముందుండే అధికారులు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో వెనుకబడిపోతున్నారు.  గ్రౌండ్ వాటర్ ఉన్న వారు ఆ నీటిని వాడుకుంటుండగా.. కృష్ణా నీటిపైనే ఆధారపడిన మాలాంటి వాళ్లం స్వచ్ఛమైన నీరు ఎప్పుడు వస్తుందో తెలియక అవస్థలు పడుతున్నాం.  - మేరుగ ప్రీతి, ముత్యాలంపాడు
 
లీకులే అధికం
కొండపైకి ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారా నీరు అంతగా చేరడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన పైపులైన్లు పాతవి కావటంతో నీరు లీకుల ద్వారా వృథా అవుతోంది. నీళ్లకోసం ఇళ్లలోని మహిళలు ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన కుళాయి నుంచి బిందెలతో తెచ్చుకుంటున్నారు.
 - కోటయ్య, గుణదల
 
 అన్నీ నలకలే వస్తున్నాయి
తాగునీటిలో నలకలు అధికంగా వస్తున్నాయి. అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఈ ప్రాంతంలో నూతన పైపులైన్లను ఏర్పాటు చేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు.     - ఉమామహేశ్వరరావు, గంగిరెద్దులదిబ్బ
 

Advertisement

What’s your opinion

Advertisement