నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

Published Mon, Jun 9 2014 1:52 AM

poly technique counseling starts to day

 గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పాలిసెట్-2014 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలిసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. తొలిరోజు ఒకటి నుంచి 20 వేల ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. పాలిసెట్ ర్యాంకర్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఎక్కడైనా హాజరు కావచ్చు. శారీరక వికలాంగులు, వినికిడి లోపం కలవారు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలి.
 
 పాలిసెట్-2014 సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సిలింగ్‌కు గుంటూరు నగరంలో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్టీ కేటగిరీ విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంకుల వారీగా ఆయా తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల వారీగా కో-ఆర్డినేటర్లు జీఎంసీ కేశవరావు (గుజ్జనగుండ్ల), ఎ.అరోజిరాణి (నల్లపాడు) పర్యవేక్షించనున్నారు.
 
 తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు
 పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు తమవెంట హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు ఒరిజినల్, జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థుల్లో ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఠీఠీఠీ.ఞౌడఛ్ఛ్టి2014.జీఛి.జీ వెబ్‌సైట్‌లో సందర్శించాలి.
 
 ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే తేదీలు
 గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ
 మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో..
 9వ తేదీన 01 నుంచి 10,000 లోపు ర్యాంకుల వారు హాజరు కావాలి. 10న 20,001 నుంచి 30,000, 11న 40,001 నుంచి 50,000, 12న 60,001 నుంచి 70,000, 13న 80,001 నుంచి 92,000, 14న 1,05.001 నుంచి 1,17,000, 15న 1,30,001 నుంచి 1,42,000, 16న 1,55,001 నుంచి 1,62,000 ర్యాంకు గల విద్యార్థులు హాజరు కావాలి.
 
 నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో...
 9వ తేదీన 10,001 నుంచి 20,000, 10న 30,001 నుంచి 40,000, 11న 50,001 నుంచి 60,000, 12న 70,001 నుంచి 80,000, 13న 92,001 నుంచి 1,05,000, 14న 1,17,001 నుంచి 1,30,000, 15న 1,42,001 నుంచి 1,55,000, 16న 1,62,001 ఆపై చివరి ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి.
 
 వెబ్ కౌన్సిలింగ్ జరిగే తేదీలు..
 సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు ఈనెల 12వ తేదీ నుంచి17వ తేదీ వరకు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్ కౌన్సెలింగ్‌లో హాజరుకావాల్సి ఉంది. ఇందుకు హెల్ప్‌లైన్ కేంద్రాలతో పాటు ఇంటర్నెట్ సెంటర్లలో హాజరుకావచ్చు. 12,13 తేదీల్లో ఒకటి నుంచి 50 వేల ర్యాంకు, 14,15 తేదీల్లో 50,001 నుంచి 1,20,000 వరకు, 16,17 తేదీల్లో 1,20,001 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరవ్వాలి.
 

Advertisement
Advertisement