ఏజెన్సీలో జీసీసీ తీరు బాగోలేదు | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో జీసీసీ తీరు బాగోలేదు

Published Wed, Apr 13 2016 2:16 AM

Poor performance of the agency in the jcc

దళారులను ప్రోత్సహిస్తున్నారు..
పాడేరు, అరకు ఎమ్మెల్యేల ధ్వజం

 

పాడేరు: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దళారులను ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు దుయ్యబట్టారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ఇద్దరూ  జీసీసీ తీరుపై ద్వజమెత్తారు. చింతపండు కొనుగోలు ధర పెంచలేదని, పలు అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఆపేశారని, గిరిజనులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, అటవీ ఉత్పత్తుల కొనుగోలులో జీసీసీ తీవ్ర అలక్ష్యం వహిస్తోందన్నారు. డీఆర్‌డిపోల నిర్వహణకు డీలర్లను నియమించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిధులిస్తున్నా కాఫీ కొనుగోలులో  సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. జీకేవీధి మండలంలో రైతుల వద్ద పెద్ద ఎత్తున కాఫీ నిల్వలు ఉండిపోయాయని, తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీసీసీ ఇటీవల విశాఖలో నిర్వహించిన గిరిజన ఉత్సవాలకు ఎమ్మెల్యేలను , గిరిజన ప్రతినిధులను ఆహ్వానించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.

 
3 గంటల్లో ముగిసిన సమావేశం

సమావేశం నామమాత్రంగా సాగింది.  26 అజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగలేదు. పాడేరు, అరకు ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్, జెడ్పీ వైస్‌చైర్మన్ హాజరయ్యారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి కిశోర్‌బాబు రాలేదు. 3 గంటల్లో సమావేశం ముగిసింది. వివిధ అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షకే సమావేశం పరిమితమైంది. వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, జీసీసీ, అటవీశాఖ, పశు సంవర్థకశాఖ, ఎస్‌ఎంఐ శాఖల పథకాలపై సమీక్ష జరిగింది. ఏజెన్సీలో రిజర్వు ఫారెస్ట్‌లో రోడ్ల నిర్మాణానికిఅటవీశాఖ అధికారులు ఆటంకం కలిగించకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. కొన్ని చోట్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, రేంజర్లు నాన్ ఫారెస్ట్ ఏరియాల్లో కూడా రోడ్ల నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నారని, దీని వల్ల పనులు ఆగిపోతున్నాయని పీవో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై విశాఖపట్నం, పాడేరు డీఎఫ్‌వోలు స్పందించి ఇలాంటి  వాటిని తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 

 

విద్యార్థుల మరణాలను నియంత్రించండి
ఏజెన్సీఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలను నియంత్రణకు నిర్ధుష్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్, పీవోలను కోరారు. రెండు నెలల్లో పది మంది విద్యార్థులు చనిపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. పాఠశాలల్లో  తరచూ వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. ఆశ్రమాల్లో హెల్త్ వర్కర్లను నియమించాలని సూచించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల మరణాలపై వార్డెన్ల మీద చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితులు మెరుగు పడవని, మరణాలకు గల కారణాలను గుర్తించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న వైద్యసేవలపై కొనసాగింపు ఉండటం లేదని, పాఠశాలల వారీగా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పీవో హరినారాయణన్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన విద్యార్థుల మరణాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీహెచ్ బృందంతో అధ్యయనం చేస్తున్నామని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిపాదించామని తెలిపారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్, డివిజన్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

ప్రజాప్రతినిధుల పట్ల అలక్ష్యం వద్దు: కలెక్టర్

సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ప్రజా ప్రతినిధులను విధిగా భాగస్వాములను చేయాలని కలెక్టర్ ఎన్.యువరాజ్ అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధుల పట్ల అలక్ష్యం వహించినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీటి పథకాల నిర్వహణపై అవగాహనకు మండలాలవారీ సర్పంచ్‌లకు వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించారు. ఏజెన్సీలో రహదారులు లేని పరిస్థితి, సీజనల్‌గా వచ్చే వ్యాధులు, తాగునీటి కొరత వల్ల  ఏర్పడుతున్న సమస్యలను అధిగమించేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. ఏజెన్సీలో ఐఏపీ పథకం నిలిచిపోయిందని, దానికి బదులుగా ఎస్‌డీపీ పథకం అమలు చేస్తున్నారన్నారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు పంచాయతీ నిధులతో పనులు చేపట్టేందుకు ఎంపీడీవోలు చొరవచూపాలన్నారు. ఇందుకు ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఉపాధి పనులు పూర్తవుతున్నందున కోళ్లు, గొర్రెలు, మేకలు వంటి యూనిట్లను సబ్సిడీపై మంజూరు చేయాలన్నారు. ఇకపై గిరిజన రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తామన్నారు.  ఐటీడీఏ పీవో హరినారాయణన్ మాట్లాడుతూ ఆశ్రమ విద్యార్థులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.

 

పర్సంటేజీలతో నాణ్యత లేని పనులు

ఏజెన్సీలో రూ. కోట్లతో చేపడుతున్న ఇంజినీరింగ్ పనుల్లో పర్సంటేజీల జోరు వల్ల అభివృద్ధిపనుల్లో నాణ్యత లోపిస్తోందని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు విమర్శించారు. స్థాయిమేరకు అధికారులు పర్సంటేజీలు పంచుకోవడం, కాంట్రాక్టర్లకు 20 శాతం పోగా.. అంచనా వ్యయంలో సగం నిధులతోనే పనులు జరుగుతున్నాయన్నారు. ఇలాగైతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులు విలువ ఇవ్వడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పనులు చేపట్టడంతో పారదర్శకత లోపిస్తున్నదన్నారు.

 

నీటి పథకాల బాధ్యత పంచాయతీలదే
ఏజెన్సీలో ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలలో నిర్మిస్తున్నతాగునీటి పథకాల నిర్వహణ బాధ్యత పంచాయతీలదేనని జిల్లా కలెక్టర్ యువరాజ్ సూచించారు. పథకాల నిర్మాణం పూర్తికాగానే వాటిని పంచాయతీలు స్వాధీనం చేసుకోవాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు సమన్వయంతో తాగునీటి పథకాల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. తాగునీటి పథకాల మరమ్మతులకు మండల పరిషత్ నుంచి కూడా నిధులు కేటాయించి నిర్వహణను మెరుగుపరుచుకోవాలన్నారు.

 

Advertisement
Advertisement