చీకట్లో పల్లెలు | Sakshi
Sakshi News home page

చీకట్లో పల్లెలు

Published Sat, Feb 24 2018 1:07 PM

Power Cut On Villages And Street Lights - Sakshi

పల్లెల్లో అంధకారం అలుముకుంది. వీధులన్నీ చీకట్లో మగ్గుతున్నాయి.బకాయిలు రాబట్టుకోవడం కోసం విద్యుత్‌ శాఖ జూలు విదిల్చింది.వీధి  లైట్లు, పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. జిల్లా వ్యాప్తంగా 906 గ్రామ పంచాయతీలుంటే ఇప్పటి వరకు 205 పంచాయతీల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు. అంటే శివారు గ్రామాలతో కలిపి సుమారు 300 గ్రామాలకు పైగా రాత్రిళ్లు అంధకారంలోకి వెళుతున్నాయి.

కొవ్వూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మైనర్‌ పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించారు. తాగునీటి సరఫరా సర్వీసులకు బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముక్కుపిండి బకాయిలు వసూలు చేస్తోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు రాబట్టు కోవడం కోసం కరెంటు సరఫరాను నిలిపివేస్తూ పల్లెలను చీకట్లోకి నెట్టింది. ఇప్పటికే విద్యుత్‌ శాఖ ఉన్నతాధికార్ల నుంచి కింది స్థాయి అధికారులకు బకాయిల వసూలుపై స్పష్టమైన ఆదేశాలందాయి. మార్చిలోపు నిర్దేశించిన మేరకు బకాయిలన్నీ వసూలు చేయాలని ఉన్నతాధికార్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఉద్యోగులు కార్యాచరణలోకి దిగారు. బకాయిలున్న పంచాయతీలకు కరెంట్‌ కట్‌ చేస్తున్నారు.

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన ఉన్న సమయంలో జనం నిలదీస్తారన్న భయంతో కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ఏకంగా 66 పంచాయతీల్లో విద్యుత్‌ కట్‌ చేశారు. గోపాలపురంలో 18, దేవరపల్లిలో 15, నల్లజర్లలో 23 పంచాయతీలలో కరెంటు సరఫరా ఆపివేశారు. విద్యుత్‌ శాఖ డివిజన్‌ల వారీగా భీమవరంలో 40, ఏలూరులో 34, తాడేపల్లిగూడెంలో 31, నిడదవోలులో 77, జంగారెడ్డిగూడెంలో 23 పంచాయతీలకు సరఫరా నిలిపివేశారు. కొంత మొత్తం చెల్లించిన వాటికి మళ్లీ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ట్రెజరీల్లో ఆంక్షల కారణంగా చెల్లింపులకు సైతం వీలు కానీ పరిస్థితి ఉంది.

రూ.225 కోట్ల విద్యుత్‌ బకాయిల
జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.225 కోట్ల మేరకు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్‌ పంచాయతీల్లో వీధిలైట్లకు రూ.26.8 కోట్లు, తాగునీటి సరఫరా సర్వీసుల నుంచి రూ.74.28 కోట్లు బకాయిలున్నాయి. మైనర్‌ పంచాయతీలలో వీధిలైట్లకి రూ.29.15 కోట్లు, వాటర్‌ వర్క్స్‌కి రూ.95.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో గత నెలలో రూ.2.16 కోట్లు వసూలు చేశారు. ఈ నెల ఇప్పటి వరకు రూ.12 లక్షలు వసూలైంది. ఇంకా సుమారు రూ.225 కోట్ల మేరకు బకాయిలు పేరుకు పోయాయి. ప్రధానంగా పాత బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉండడంతో రోజు రోజుకి ఈ బకాయిలు కోట్లల్లో పేరుకుపోతున్నాయి. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉండడంతో తాగునీటి సర్వీసులకు బిల్లుల చెల్లింపు భారంగా మారిందని పంచాయతీల సర్పంచులు వాపోతున్నారు. బకాయిల్లో సింహభాగం రూ.169.76 కోట్లు తాగునీటి సరఫరా సర్వీసులకు చెందినవే ఉన్నాయి.

కరెంటు సరఫరా నిలిపివేయడం సరికాదు
పంచాయతీ వీధిలైట్లకు విద్యుత్‌ సరఫరా తొలగించడం సమజసం కాదు. పాత బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీలకు విద్యుత్‌ బిల్లులు చెల్లింపు గుదిబండగా మారింది. ఉన్న వీధిలైట్లు తొలగించి ఎల్‌ఈడీ లైట్లు అమర్చమన్నారు. ఇప్పుడు  నెలకి ఒక్కో లైటుకి రూ.50లు చొప్పున వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కట్‌ చేసుకుని పంపుతున్నారు. – ముదునూరి జ్జానేశ్వరి, సర్పంచి, దొమ్మేరు

మైనర్‌ పంచాయతీలకు వెసులుబాటు ఇవ్వాలి
మైనర్‌ పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపు భారంగా ఉంది. అసలే ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారులు బిల్లులు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మూడు రోజులుగా సరఫరా నిలిపివేశారు. పంచాయతీలో ఉన్న మూడు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దివంగత నేత వైఎస్సార్‌ ఇచ్చినట్టు మైనర్‌ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కొండేపూడి రమేష్, సర్పంచి, పోచవరం, తాళ్లపూడి మండలం

Advertisement
Advertisement