చుక్‌.. చుక్‌.. చిక్కులు | Sakshi
Sakshi News home page

చుక్‌.. చుక్‌.. చిక్కులు

Published Sat, Apr 28 2018 8:38 AM

Prashanthi Express Two Hours Late In Ananhtapur Station - Sakshi

రైల్వే ప్రయాణికులకు శుక్రవారం చుక్కలు కనిపించాయి. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటల పాటు ఆలస్యం కాగా విజయవాడకు వెళ్లే ప్రయాణికులతో పాటు సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. అదేవిధంగా హిందూపురం ప్యాసింజర్‌ రైలు కూడా మూడు గంటలు ఆలస్యమైంది.

అనంతపురం టౌన్‌ :నిమిషాలు కాదు.. ఏకంగా గంటలపాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు తప్పలేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఒక్కటే అనుకూలం. అయితే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ అనంతపురం రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.35 గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటలు పైగా ఆలస్యమైంది. దీంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులు స్టేషన్‌లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దీనికితోడు శనివారం ఉదయం విజయవాడలో సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ప్రవేశపరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రశ్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు రెండు గంటలపాటు ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ విజయవాడకు ఉదయం 7గంటలకు వెళ్లాల్సి ఉంది. రెండు గంటలు ఆలస్యం కావడంతో ఉదయం 9గంటలు వెళ్తుంది. ఉదయం 9గంటలకే పరీక్ష ఉండడంతో విద్యార్థులు ఇతర మార్గాల్లో విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

హిందూపురం ప్యాసింజర్‌  అంతే..
గుంతకల్లు నుంచి హిందూపురం వెళ్లే ప్యాసింజర్‌ రైలు (77418) ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 5:10 గంటలకు స్టేషన్‌కు రావాల్సిన రైలు.. రాత్రి 8గంటలు అయినా స్టేషన్‌కు చేరుకోలేదు. ముందస్తుగా టిక్కెట్లు తీసుకున్న ప్రయాణికులు గత్యంతరం లేక వేచి ఉండాల్సిన పరిస్థితి. రైళ్లు సకాలంలో స్టేషన్‌కు చేరే విధంగా చర్యలు చేపట్టాలని   విద్యార్థులు రైల్వే మేనేజర్‌ తిప్పానాయక్‌కు శుక్రవారం రాత్రి వినతిపత్రం అందజేశారు.

ఉదయం 9గంటలకు పరీక్ష ఉంది
విజయవాడలో కేంద్ర విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ఉదయం 9గంటలు ఉంది. అయితే ప్రశాంతి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే టిక్కెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నా. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ఇతర మార్గాల్లో విజయవాడకు వెళ్లాలి.   – అనిల్‌కుమార్, విద్యార్థి

Advertisement

తప్పక చదవండి

Advertisement