అధ్యక్షా..! | Sakshi
Sakshi News home page

అధ్యక్షా..!

Published Fri, Jul 4 2014 2:19 AM

అధ్యక్షా..! - Sakshi

- జిల్లాలో కొలువుదీరిన పురపాలక సంఘాలు
- చీరాల, చీమకుర్తి, కనిగిరి, అద్దంకిలో టీడీపీ
- గిద్దలూరులో వైఎస్సార్ సీపీ పాగా
- మార్కాపురం చైర్మన్ ఎంపిక వాయిదా
- చీరాల్లో ఆమంచి, పోతుల వర్గాల బాహాబాహి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పురపాలక సంఘాల్లో పాలక వర్గాలు ఎట్టకేలకు కొలువుదీరాయి. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయితీలకు మార్చి 30న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న పాలక వర్గాల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గురువారం జరిగింది. గిద్దలూరు నగర పంచాయతీని వైఎస్సార్ కాంగ్రెస్ తన ఖాతాలో జమ చేసుకుంది. చీరాల, చీమకుర్తి, కనిగిరి, అద్దంకి పురపాలక సంఘాలను తెలుగుదేశం గెలుచుకుంది.

మార్కాపురంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నా వైస్ చైర్మన్ ఎంపిక తేలకపోవడంతో ముహూర్తం బాగోలేదన్న సాకుతో వాయిదా వేశారు. చీరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు ఆయన వర్గం మద్దతుతో చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. వైస్ చైర్మన్ పదవికి మాత్రం ఆ వర్గం వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు పలికింది.
 
చైర్మన్లు వీరే..

గిద్దలూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా బండారు వెంకటసుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా 19వ వార్డుకు చెందిన పాలుగుళ్ల శ్రీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ముత్తుముల ఆశోక్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అద్దంకి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా పరిమి దయామణి, వైస్ చైర్మన్‌గా లక్ష్మీశ్రీనివాసరావు ఎన్నికయ్యారు. కనిగిరి నగర పంచాయతీ చైర్మన్‌గా ఎస్‌కే చిన మస్తాన్, వైస్ చైర్మన్‌గా వీవీఆర్ మనోహర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 చీమకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీకి చెందిన కౌత్రపు రాఘవ, వైస్ చైర్మన్‌గా కందిమళ్ల గంగాధర్ ఎన్నికయ్యారు. మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించి ముహూర్తం బాగాలేదంటూ తెలుగుదేశం కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీలో వైస్ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలన్నదానిపై స్పష్టత రాకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. మెజారిటీ సీట్లు గెలుపొందిన తెలుగుదేశం సభ్యుల గైర్హాజరుతో కోరం లేక సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది.
 
చీరాలలో రణరంగం
చీరాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం రణరంగాన్ని తలపించింది. ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేత పోతుల సురేష్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు దాడులకు సిద్ధమై వచ్చారు. ఆమంచి ప్యానెల్ మద్దతుతో తెలుగుదేశం పార్టీ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  వైస్ చైర్మన్ ఎంపికలో ఆమంచి మద్దతు తెలిపారు. కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమంచి, పోతుల సురేష్ వర్గాలు ఘర్షణకు దిగాయి.

పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆమంచి, పోతుల వర్గీయులు ముందుగానే తెచ్చుకున్న రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అరగంటపాటు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. పోతుల సురేష్ కారును ధ్వంసం చేశారు. ఆ ఘటనలో సురేష్ తలకు గాయమైంది. ఆమంచి వర్గీయుల్లో కొందరికి తలలు పగిలాయి. కార్యకర్తల రాళ్లదాడిలో అక్కడే ఉన్న వేటపాలెం ఎస్సై రామిరెడ్డి తలకుగాయంకాగా డిఎస్పీ నరహర, రూరల్ సీఐ ఫిరోజ్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. ఘర్షణను చిత్రీకరిస్తున్న విలేకరులూ కొందరు గాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement