ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి

Published Wed, Mar 11 2015 1:16 AM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒత్తిడి - Sakshi

నిరుద్యోగులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ
ఐక్యవేదిక విజ్ఞప్తిపై స్పందన

 
హైదరాబాద్:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. వేదిక ప్రతినిధి లగుడు గోవిందరావుతోపాటు పలువురు నిరుద్యోగులు మంగళవారం లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయం లో జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ర్టంలో ఏపీపీఏస్సీ గ్రూప్-1,2,4, జేఎల్, డీఎల్, ఎస్సై, కానిస్టేబుల్, వీఆర్‌వో, పంచాయతీ, అటవీశాఖలోని పోస్టులన్నీ కలపి సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నిరుద్యోగులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేసేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని కోరారు.

ఇంటికో ఉద్యోగం అన్న వాగ్దానాన్నీ కూడా నెరవేర్చేలా చూడాలని విన్నవించారు. ఈ మేరకు నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఖాళీలు భర్తీ అయ్యేలా కృషి చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. కాగా, ఉద్యోగాల నియామకాల్లో ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ విధానాన్ని అమలు చేయాలని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే సంకల్ప దీక్షకు మద్దతివ్వాలని కూడా వారు జగన్‌ను కోరారు. జగన్‌ను కలసిన వారిలో కె.మహేష్, పి.శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు తదితరులు ఉన్నారు.
 

Advertisement
Advertisement