సర్కారీ స్కూళ్లు..శిథిల గూళ్లు! | Sakshi
Sakshi News home page

సర్కారీ స్కూళ్లు..శిథిల గూళ్లు!

Published Wed, Jun 11 2014 2:51 AM

సర్కారీ స్కూళ్లు..శిథిల గూళ్లు! - Sakshi

 సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలలు సమస్యల నిలయాలుగా మారాయి. విద్యార్థులకు నరకం చూపుతున్నాయి. జిల్లాలో అన్ని వసతులున్న ప్రభుత్వ పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. విద్యారంగంలో దినదినప్రవర్ధమానం కావాల్సిన జిల్లా..ఏడాదికేడాది వెనకబడుతోంది. గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. నూతనోత్సాహంతో బడిబాట పట్టే పిల్లలకు అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలలు స్వాగతం పలకనున్నాయి. కిందటేడాది పశ్చిమ మండలాల్లో ఉన్న పాఠశాలల పురాతన భవనాల శ్లాబ్‌లు పెచ్చులూడి విద్యార్థులపై పడిన సందర్భాలూ ఉన్నాయి.
 
 =    మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఇంకా చెట్ల కింద చదువులే కొనసాగుతున్నాయి.
 =    ఏటా అదనపు తరగతి భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నా..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో తరగతి గదుల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.
 =    మంచినీరు, మరుగుదొడ్లు తదితర కనీస వసతులు కల్పించాల్సిన రాజీవ్ విద్యామిషన్ ఆచరణలో చతికిల పడుతోంది.
 =    జిల్లాలో 699 ఉన్నత పాఠశాలలు, 572 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,186 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది 2.5 లక్షల మంది పిల్లలు చదివారు.
 =    సరిపడా విద్యార్థులు లేకపోవడంతో కిందటేడాది కొన్ని మండలాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.
 =    ఈ ఏడాది అంతకంటే ఘోరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 =    ఇవి కాకుండా ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలలు 240కిపైగా ఉన్నాయి. అయితే ఆయా పాఠశాలల పరిస్థితి విద్యార్థుల బోధనకు అంత అనువుగా లేదనే చెప్పాలి.
 =    మినీ గురుకుల పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలల భవనాల పరిస్థితి కొంత బాగానే ఉన్నా..అక్కడ చదివే విద్యార్థులకు మంచినీరు, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఏర్పాటు చేయాల్సిన వంట షెడ్లు కూడా దాదాపు అన్ని చోట్లా పాతబడిపోవడంతో పిల్లలకు ఆరుబయటే వంట తయారు చేస్తున్నారు.  
 
 జిల్లా పరిస్థితి ఇదీ..
 =    జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల సంఖ్య మొత్తం 4822 ఉండగా, వాటిల్లో 3126 పాఠశాలలకు మాత్రమే ప్రహరీలున్నాయి. మిగతా 1696 పాఠశాలల చుట్టూ రక్షణ  ఏర్పాట్ల గురించి పట్టించుకున్న నాథుడులేరు.
 =    అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణాలు 6,426 వినియోగంలో ఉన్నప్పటికీ, 2299 మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మంచినీటి పంపులు సైతం అన్నిచోట్లా మరమ్మతులకు గురయ్యాయి.
 =    పభుత్వ పాఠశాలల్లో అమలవుతోన్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ పై ప్రతీ ఏడాది విద్యాశాఖ ప్రణాళికలో పొందుపరిచిన వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 =    ఈ సంవత్సరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బడిబాట కార్యక్రమం జరగలేదు. విద్యాసంబరాలకు ముందుగానే విద్యాశాఖ ప్రత్యేక కమిటీని జిల్లాలో అన్ని గ్రామాలకు పంపి శిథిలావస్థ పాఠశాలలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, వసతుల కల్పనపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపేది. పాఠశాలలకు రంగులు వేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, గదులకు మరమ్మతులు చేయించడం..
 =    అన్ని కార్యక్రమాలు బడిబాట కార్యక్రమంలో భాగంగానే పూర్తిచేసేవారు. 2008 సంవత్సరం నుంచి ఈవిధానం అమలవుతున్నా.. ఈఏడాది విద్యాశాఖాధికారులు మిన్నకున్నారు.

Advertisement
Advertisement