నీలికిరోసీన్ మారుతోంది | Sakshi
Sakshi News home page

నీలికిరోసీన్ మారుతోంది

Published Wed, May 21 2014 12:34 AM

నీలికిరోసీన్ మారుతోంది - Sakshi

పాతగుంటూరు, న్యూస్‌లైన్: అసలే వేసవికాలం. విద్యుత్ సరఫరా ఉండటమే లేదు. అంతా కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. చిన్నపాటి పనికి కూడా లాంతర్ల అవసరం కలుగుతోంది. కొందరు వంటకోసం కూడా కిరోసిన్ వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను రేషన్ డీలర్లకు వరంగా మారింది. లబ్ధిదారులకు అందించాల్సిన కిరోసిన్ ఎంచక్కా అక్రమ వ్యాపారులకు అప్పగించేసి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కిరోసిన్ లోడ్ వస్తోందని తెలియగానే అక్రమవ్యాపారులు అక్కడ వాలిపోతారు. మొత్తం కిరోసిన్ వారికి అప్పగించేసి కొద్దిపాటి సరకును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పైగా రెండు నెలలకోసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామంటూ బహిరంగంగానే లబ్ధిదారులకు చెబుతున్నారు. స్టాకు రాలేదనీ, ఎన్నాళ్లవరకు మీకోసం ఎదురు చూడాలని ఇలా రకరకాలుగా లబ్ధిదారులకు ఎదురు ప్రశ్నలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు అధికమొత్తాలు చెల్లించి బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.
 
 జిల్లాలోని బొల్లాపల్లి, మాచవరం, బెల్లంకొండ, క్రోసూరు, రాజుపాలెం, నకరికల్లు, దుర్గి మండలాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే డీలర్లు, కిరోసిన్ హాకర్లు వ్యాపారులతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుంటూరు నుంచి సరఫరా కేంద్రానికి వెళ్లే మార్గంలోనే కిరోసిన్ ఇచ్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2704 రేషన్ షాపులు, 780 కిరోసిన్ హాకర్లు ఉన్నాయి. జిల్లాలో 14500 మంది కార్డుదారులకు ప్రతీనెలా 22 వేల కిలోలీటర్లు కిరోసిన్ సరఫరా కావాల్సి ఉంది. కానీ అందులో పావువాటా కూడా కార్డుహోల్డర్లకు అందడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమ వ్యాపారులు ముందుగానే డీలర్లకు నగదు చెల్లిస్తారు. ఆ మొత్తాలను డీడీల రూపంలో చెల్లించి సరకు తెచ్చుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా రెండు, మూడు నెలలపాటు కిరోసిన్ వారికి అప్పగించేసి, ఇతర సరకులు అమ్ముకోవడం ద్వారా సంపాదించింది సొంతానికి వాడుకుంటున్నారని తెలుస్తోంది.
 
 కొరవడిన పర్యవేక్షణ..
 పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరకు డీర్లకు చేర్చేందుకు రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అయితే కిరోసిన్ రాత్రివేళ తరలిస్తుండటంతో రూట్ ఆఫీసర్లు వాటిని పర్యవేక్షించడంలేదని, ముందుగానే వారితో కుదుర్చుకున్న ఒప్పందంతో వారు కనీసం వాటిని పరిశీలించడం లేదని తెలుస్తోంది. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేసినపుడే కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించేసి, ఎటువంటి కేసులు తమవరకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం:
 డీఎస్‌ఓ రవితేజనాయక్
 కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి రవితేజనాయక్‌వద్ద న్యూస్‌లైన్ ప్రస్తావించగా కిరోసిన్ సరఫరాపై ఇప్పటివరకూ తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని, వచ్చిన తరువాత రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేంగాకుండా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తామని, అక్రమంగా కిరోసిన్‌ను తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement