తెలంగాణ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకం | Sakshi
Sakshi News home page

తెలంగాణ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకం

Published Tue, Aug 13 2013 2:30 AM

Role of youth in Te;angana reconstruction is crucial, important, says Kavita

ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏమిధంగానైతే పాల్గొన్నారో.. పునర్నిర్మాణంలో కూడా అదే భాగస్వామ్యాన్ని కొనసాగించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్‌జీ డిగ్రీ, పీజీ కాలేజీలో సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువత వర్క్‌షాపులో ఆమె పాల్గొని ప్రసంగించారు. పునర్నిర్మాణం రాజకీయ నాయకులకు వదిలిపెడితే అనుకున్న రీతిలో ఉండకపోచ్చని, వారికి అనుకూలంగా మలచుకొనే అవకాశముంటుందన్నారు.

రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తామంటే దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయని విమర్శించారు. పార్టీలు ఈ చట్టం  పరిధిలోకి వస్తే ఆ పార్టీలకు వచ్చే నిధుల వివరాలు చెప్పాల్సి ఉంటుందని, అందుకే రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావడానికి ఒప్పుకోవడం లేదన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చినా, రాకున్నా విలువలు పాటించాలన్నారు. తెలంగాణ బిడ్డగా విలువలు మరచిపోవద్దన్నారు. నిజాన్ని చెప్పాలని, నిజాయితీగా ఉండాలని, నిర్భయంగా, పట్టుదలతో ముందుకు పోవాలని ఉద్భోదించారు. యువతకు తెలంగాణ జాగృతి అండగా నిలుస్తుందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

తెలంగాణలో ఐఏఎస్, ఏపీఎస్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, విద్యార్థులు సివిల్స్‌కు ఎంపికై రాష్ట్రాభివృద్ధికి తీసుకొనే విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలపై మేధోమథనం జరిపి సిలబస్, మార్గాలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరముందన్నారు. భూవిధానం, జల విధానంపై ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ఆలోచనలు చేశారని, అద్భుతమైన చట్టాలు తీసుకొద్దామన్నారు. హైదరాబాద్ గతంలోనూ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదన్నారు. తెలంగాణలో కళాకారులకు కొదవ లేదని, ప్రత్యేక రాష్ట్రంలో వీరికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.

తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకొన్న ఆ పార్టీని నమ్మలేని పరిస్థితి ఉందని, అందుకే సంబరాలు చేసుకోలేదని కవిత చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి అమోదం పొందిన తరువాతే సంబరాలు జరుపుకొందామన్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమన్నారు. ఇచ్చింది కాంగ్రెస్ అయినా తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో యువత అసమాన పోరాటాన్ని ప్రదర్శించిందన్నారు. పునర్నిర్మాణంలోను తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మాస్టర్జీ డిగ్రీ, పీజీ కళాశాల డెరైక్టర్ సుందర్‌రాజ్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement